Begin typing your search above and press return to search.

క్రిటిక్స్ అభిప్రాయంతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద 'అఖండ' ప్రభంజనం..!

By:  Tupaki Desk   |   4 Dec 2021 3:30 PM GMT
క్రిటిక్స్ అభిప్రాయంతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద అఖండ ప్రభంజనం..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ''అఖండ''. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ మూవీ.. ఖండ ఖండాలలో అఖండమైన విజయాన్ని అందుకుంటోంది.

'సింహా' 'లెజెండ్' తర్వాత బాలయ్య - బోయపాటి కాంబోలో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ఈ సినిమా దుమ్ముదులుపుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన పెద్ద సినిమాగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ కు మళ్ళీ కళ తీసుకొచ్చింది.

'అఖండ' సినిమా యూఎస్ఏ లో వసూళ్ల సునామీ సృట్టిస్తోంది. ప్రీమియర్స్ తో కలిసి ఈ మూవీకి అమెరికాలో 550K+ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్ లో మిలియన్ మార్క్ చేరుకునే అవకాశం ఉంది. ఒక మాస్ సినిమా ఓవర్ సీస్ లో ఈ రేంజ్ లో వసూళ్ళు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.

అలానే తెలుగు రాష్ట్రాల్లో 'అఖండ' సినిమా మొదటి రోజే 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండూ రోజు కూడా బాలయ్య సినిమా అదే ఊపును కొనసాగించిందని తెలుస్తోంది. ఏదేమైనా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది.

నిజానికి 'అఖండ' చిత్రానికి క్రిటిక్స్ సైడ్ నుంచి మిశ్రమ స్పందనే వచ్చింది. రివ్యూస్ కూడా యావరేజ్ గానే వచ్చాయి. కానీ ఆడియన్స్ ఇవేమీ పట్టించులేదు. చాలా రోజుల తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన మాస్ సినిమా కావడంతో జనాలు ఎగబడి చేసేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రచారాన్ని కూడా లెక్క చేయకుండా సినిమాని ఆదరిస్తున్నారు. బాలయ్య ప్రభంజనానికి సాక్షులుగా నిలుస్తున్నారు.

'అఖండ' చిత్రంలో మురళీకృష్ణ - శివుడిగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. అఘోరా పాత్రలో నటసింహం చూపించిన నట విశ్వారూపం ప్రేక్షకులను అలరిస్తోంది. బాలకృష్ణ మార్క్ పంచ్‌ డైలాగులు - బోయపాటి తరహా యాక్షన్‌ సీన్స్ నందమూరి ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 'అఖండ' సినిమా సక్సెస్ లో ఎస్ఎస్ థమన్ సంగీతం కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి.

ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీసాడు. బాలకృష్ణ ఎలివేషన్ సీన్లకు.. యాక్షన్ ఘట్టాలకు థమన్ అందించిన ఆర్ఆర్ నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీయడానికి థమన్ కూడా ఒక కారణమని నిస్సందేహంగా చెప్పొచ్చు.

ఏదైతేనేం 'అఖండ' సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపు తీసుకొచ్చింది. గత కొన్నాళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న బాలకృష్ణ కు సాలిడ్ సక్సెస్ అందించింది. 2021లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇది ఇండస్ట్రీకి కూడా జోష్ నింపింది. మరి రాబోయే రోజుల్లో నటసింహం గర్జన ఎంత వసూళ్లను తెచ్చిపెడుతుందో చూడాలి.

కాగా, 'అఖండ' చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ ‏గా నటించింది. విలన్స్ గా శ్రీకాంత్ - నితిన్ మెహతా కనిపించగా.. జగపతిబాబు - పూర్ణ - కాలకేయ ప్రభాకర్ - సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.