Begin typing your search above and press return to search.

వికారాబాద్ ఫారెస్ట్ లో 'అఖండ' క్లైమాక్స్..!

By:  Tupaki Desk   |   19 April 2021 10:30 AM GMT
వికారాబాద్ ఫారెస్ట్ లో అఖండ క్లైమాక్స్..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ''అఖండ''. ఇందులో ప్రగ్యా జైస్వాల్‌ - పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలయ్య ఈ చిత్రంలో ఫ్యాక్షనిస్ట్ గా అఘోరాగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఉగాది సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కు విశేష స్పందన వస్తోంది. యూట్యూబ్ లో ఇప్పటివరకు 25 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని, సీనియర్ హీరోల్లో తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ అందుకున్న టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

'అఖండ' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కోవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం మొయినాబాద్ లోని రిసార్ట్స్ లో బాలకృష్ణ - ప్రగ్యా జైస్వాల్‌ మధ్య కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. దీని తర్వాత వికారాబాద్ అడవుల్లో బాలయ్య - శ్రీకాంత్ పాల్గొనే ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా పరిస్థితుల్లో సినిమా విడుదల సాధ్యమవుతుందా అనేది చూడాలి.

ఇకపోతే 'అఖండ' చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. థమన్‌ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా.. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 'సింహా' 'లెజెండ్' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.