Begin typing your search above and press return to search.

ప్రామీస్ బ్రేక్ చేస్తున్న 'ఆకాశవాణి' టీమ్

By:  Tupaki Desk   |   17 Sep 2021 11:30 PM GMT
ప్రామీస్ బ్రేక్ చేస్తున్న ఆకాశవాణి టీమ్
X
పలు విలక్షణ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన గుణ్ణం గంగరాజు తనయుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రాజమౌళి ఫ్యామిలీ యూత్‌ ట్యాలెంట్స్ కలిసి మొదలు పెట్టిన సినిమా 'ఆకాశవాణి'. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమాకు మెయిన్ నిర్మాతగా మొదట్లో వ్యహరించాడు. కాని కొన్ని క్రియేటివ్‌ విభేదాల కారణంగా కార్తికేయ బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత సినిమా బాధ్యతలను ఇతరులు ఎత్తుకున్నారు. ఆ సినిమా కోసం దాదాపుగా రెండేళ్లకు పైగా జనాలు వెయిట్‌ చేస్తున్నారు. కరోనా కారణంగా ఆకాశవాణి చాలా చాలా ఆలస్యం అయ్యింది. షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత కూడా విడుదల విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. కొన్ని నెలల క్రితం టీజర్ ను విడుదల చేసి ఖచ్చితంగా థియేటర్లలోనే వస్తామంటూ ప్రామీస్ చేశారు.

టీజర్‌ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ఇన్ని రోజులు ఓటీటీకి వెళ్లని కారణంగా ఏ సమయంలో అయినా ఆకాశవాణి థియేటర్లలో దిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు థియేటర్ల హామీని మరచి సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌ కు ఇచ్చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న ఆకాశవాణి సినిమా ఇప్పటికే విడుదల చేయడం చాలా ఆలస్యం అయ్యింది. ఇంకా సినిమాను విడుదల చేయకుండా ఉండటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కూడా తగ్గే అవకాశం ఉంది. అందుకే క్రేజ్ ఉన్న సమయంలోనే విడుదల చేస్తే బాగుంది. కాని ఇప్పట్లో థియేటర్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. మంచి సమయంలో విడుదల చేస్తే మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. కాని మంచి డేట్లు అన్ని కూడా ఇప్పటికే బుక్‌ అయ్యాయి. వచ్చే ఏడాది సమ్మర్ వరకు వరుసగా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాయి.

ఆ కారణం వల్లే ఆకాశవాణి సినిమాను థియేటర్‌ రిలీజ్ కు వెళ్లాలని మేకర్స్ అనుకున్నా కూడా తప్పని పరిస్థితుల్లో ఓటీటీకి వెళ్లాల్సి వస్తుందని మేకర్స్ చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆకాశవాణి సినిమాకు కీరవాణి తనయుడు కాళభైరవ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్రలో కనిపించడంతో పాటు పలువురు ప్రముఖ నటీ నటులు ఇందులో కనిపించబోతున్నారు. సినిమా కాన్సెప్ట్‌ తెలుగు ప్రేక్షకులకు చాలా విభిన్నంగా కొత్తగా అనిపిస్తుందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా ను మద్యలో విభేదాలు తలెత్తినా కూడా ఎక్కడ రాజీ పడకుండా అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేసినట్లుగా మేకర్స్ చెబుతున్నారు.

దర్శకుడు అశ్విన్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాడని ఆకాశవాణి సినిమాతో సంబంధం ఉన్న వారు చెబుతున్నారు. ఇక ఈ సినిమాను ఇటీవలే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సోనీలివ్‌ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ ద్వారా విడుదల చేయబోతున్నారు. భారీ మొత్తంను సోనీలీవ్‌ వారు ఈ సినిమాకు గాను పెట్టినట్లుగా తెలుస్తోంది. పలు ఓటీటీలు పోటీ పడగా సోనీ లీవ్ ఈ సినిమాను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే స్ట్రీమింగ్‌ కు సంబంధించిన తేదీని ప్రకటించడంతో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా ఆకాశవాణి చిత్ర యూనిట్‌ సభ్యులు మొదలు పెట్టబోతున్నారు.