Begin typing your search above and press return to search.

జక్కన్న శిష్యుడు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించేనా..?

By:  Tupaki Desk   |   22 Sept 2021 4:00 PM IST
జక్కన్న శిష్యుడు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించేనా..?
X
ఎస్.ఎస్.రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్ గంగరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ''ఆకాశవాణి''. విలక్షణ నటుడు సముద్రఖని - వినయ్ వర్మ - తేజ కాకుమాను - ప్రశాంత్ - గెటప్ శీను ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అప్పుడెప్పుడో థియేట్రికల్ రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం.. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల వల్ల డైరెక్ట్ ఓటీటీ విడుదలకు రెడీ అయింది. సోనీ లివ్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో సెప్టెంబర్ 24న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు చిత్ర బృందం తెలిపింది.

'ఆకాశవాణి' చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'యూ/ఏ' (U/A) సర్టిఫికేట్ జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇటీవల ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. కొండ ప్రాంతంలో ఆదివాసీల జీవితాల చుట్టూ అల్లుకున్న కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. వీరి జీవితాల్లో ఆకాశవాణి ఎలాంటి పాత్ర పోషించిందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

కొత్త దర్శకుడు అశ్విన్ గంగరాజు తన ఫస్ట్ సినిమాకే విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నాడని ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి అర్థం అవుతోంది. మరి యంగ్ డైరెక్టర్ తొలి ప్రయత్నంలోనే విజయం సాధిస్తాడో లేదో చూడాలి. 'ఆకాశవాణి' చిత్రానికి ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. కాల భైరవ సంగీతం సమకూర్చారు. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఏయూ అండ్ ఐ (AU & I) స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎ.పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.