Begin typing your search above and press return to search.

ఈ సస్పెన్స్ ఏంటి శర్వా?

By:  Tupaki Desk   |   7 March 2018 11:45 AM IST
ఈ సస్పెన్స్ ఏంటి శర్వా?
X
ఏదైనా సినిమా ప్రకటన లేదా పోస్టర్ వెలువడినప్పుడు దానికి పనిచేస్తున్న సాంకేతిక నిపుణుల పేర్లతో సహా అందులో పేర్కొనడం చాలా సహజం. కాని ఈ మద్య కొత్త ట్రెండ్ ఏదో నడుస్తున్నట్టు ఉంది. థియేటర్ల సమ్మె మొదలుకాక ముందు విడుదలైన శ్రీకాంత్ రారా సినిమాను దర్శకుడి పేరు లేకుండానే విడుదల చేసి చివరికి ఆ కళాఖండం తీసిన డైరెక్టర్ ఎవరో బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా అతని భవిష్యత్తుని కాపాడారు. అదలా ఉంచితే శర్వానంద్ సినిమాకు కూడా ఒక చిత్రమైన చిక్కొచ్చి పడింది. నిన్న శర్వా పుట్టిన రోజు సందర్భంగా ఎకే ఎంటర్ టైన్మెంట్ సంస్థ విషెస్ చెబుతూ తమ బ్యానర్ లో శర్వాతో త్వరలో ఒక సినిమా చేయబోతున్న అర్థం వచ్చేలా పోస్టర్ రిలీజ్ చేసింది. కాని అందులో దర్శకుడి పేరు లేకపోవడమే అసలు ట్విస్ట్.

నిజానికి శర్వానంద్ తో ఎకె సంస్థ ఒప్పందం చేసుకున్న టైంకి దర్శకుడు శ్రీనివాస రాజు చెప్పిన కథ లైన్ లో ఉంది. దండుపాల్యం సిరీస్ తో పేరు తెచ్చుకున్న శ్రీనివాసరాజు శర్వాకు కథ చెప్పి ఓకే చేయించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కాని వర్క్ అవుట్ కాలేదు. ఎందువల్లో శర్వానంద్ కు అతను చెప్పిన లైన్ సంతృప్తికరంగా అనిపించకపోవడంతో నో చెప్పాడట. ఒకవేళ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే ఈ పోస్టర్ లో శ్రీనివాసరాజు పేరు ఉండేది.ఆ రకంగా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.

కథ సెట్ అయిపోయి దర్శకుడు దొరికితే ఎలాగూ సెట్స్ మీద వెళ్ళే సినిమానే కాబట్టి ఎకె సంస్థ ఇలా ప్రకటన ఇచ్చింది అనుకోవచ్చు. ప్రస్తుతం హను రాఘవపూడితో పడి పడి లేచె మనసు షూటింగ్ లో బిజీ గా ఉన్న శర్వా రాధా రిజల్ట్ తర్వాత స్పీడ్ తగ్గించి కథల మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నాడు. అందుకే గ్యాప్ వస్తున్నా కేర్ చేయటం లేదు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే ఆకట్టుకున్న పడి పడి లేచే మనసులో సాయి పల్లవి హీరొయిన్.