Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: స్టార్ వార్ ఎటు దారి తీస్తుందో?

By:  Tupaki Desk   |   6 Aug 2021 1:01 PM IST
టాప్ స్టోరి: స్టార్ వార్ ఎటు దారి తీస్తుందో?
X
సోష‌ల్ మీడియాల్లో స్టార్ హీరోల‌ అభిమానుల న‌డుమ ట్రోలింగ్ వార్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలాంటి సోష‌ల్ మీడియా యుద్ధాలు టాలీవుడ్.. కోలీవుడ్ లో నిరంత‌రం చూస్తున్న‌వే. హీరోల‌ అభిమానులు శ్రుతి మించిన భాష‌తో..అస‌భ్య ప‌ద‌జాలంతో ఒక‌రిపై ఒక‌రి దాడి చేసుకోవ‌డం ప్ర‌తిసారి బ‌య‌ట‌ప‌డుతోంది. ఒక‌ప్పుడు అభిమాన సంఘాల గ‌డ‌బిడ ఉండేది.. థియేట‌ర్ల వ‌ద్ద కొట్లాట‌లు సాగేవి. కానీ ఇప్పుడు ప్ర‌తిదానికి సోష‌ల్ మీడియా ఓ వేదిక‌గా మారిపోయింది. యూట్యూబ్ రికార్డుల కోసం.. ఫేస్ బుక్.. ఇన్ స్టా.. ట్విట‌ర్ లైక్ ల కోసం ..షేర్ ల కోసం కొంత మంది అగ్ర హీరోల అభిమానులు అదే ప‌నిమీద ఉంటున్నారు. అయితే ఈ ఒర‌వ‌డి టాలీవుడ్ ని మించి కోలీవుడ్ లో తంబీల్లో ఇంకాస్త ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

తాజాగా మ‌రోసారి త‌ళా అజిత్.. ద‌ల‌ప‌తి విజ‌య్ అభిమానుల మ‌ధ్య ఇలాంటి వార్ కి తెర లేచింది. యూ ట్యూబ్ రికార్డుల విష‌యంలో త‌లెత్తిన వివాదం ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే తళా అజిత్ న‌టించిన చిత్రంలోని `నాంగా వెర మారి` పాట‌ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. 23 గంటల 5 నిమిషాల్లో ఒక మిలియన్ లైక్ లను సంపాదించి రికార్డులు తిర‌గ‌రాసింది. గ‌తంలో ఈ రికార్డు విజ‌య్ పేరిట ఉండేది. ఆయ‌న న‌టించిన `మాస్ట‌ర్` లోని కుట్టీ స్టోరీ పాట 24 గంటల్లో 1.4 మిలియన్ లైక్ లను పొందింది. దానిని త‌ళా అధిగ‌మించాడు.

స‌రిగ్గా ఇక్క‌డే ఇద్ద‌రి హీరోల అభిమానుల న‌డుమ‌ వైరం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. యూట్యూబ్ లో టెక్నిక‌ల్ గా జిమ్మికులు చేసి విజ‌య్ అభిమానులు ఓ ఫేక్ రికార్డుని సృష్టించారని త‌ళా అభిమానులు మండిప‌డుతున్నారు. నాంగా వెర మారి .. పాట రిలీజ్ కు సంబంధించి యూ ట్యూబ్ లో ప్రీమియ‌ర్ రిమైండ‌ర్ రిలీజ్ సెట్ చేసి పెట్టారు. కాబ‌ట్టి ఆ పాట రిలీజ్ కు ముందే ఎవ‌రైనా లైక్ కొట్టే అవ‌కాశం ఉంటుంది. కానీ మాస్ట‌ర్ లో `కుట్టిస్టోరీ` సాంగ్ రిలీజ్ కి అలాంటి సెట‌ప్ లేకుండా రిలీజ్ అయిందని ఫ్యాన్స్ వాదించగా..ఆ సాంగ్ కి అన్ని లైక్స్ ఎలా వ‌చ్చాయో చెప్పాలంటూ అజిత్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆ పాట రికార్డులు అన్ని ఫేక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ గ‌డ‌బిడ‌తో గుట్టంతా ర‌ట్ట‌వుతోంది.

త‌ళా వ‌ర్సెస్ ద‌ళ‌ప‌తి గ‌తంలోనూ..

ఫ్యానిజం పీక్స్ కి చేరుకుంటే ఎలా ఉంటుందో అజిత్ .. విజ‌య్ ఫ్యాన్స్ గ‌తంలోనూ చాలా సార్లు నిరూపించారు. హద్దుమీరి తీవ్ర‌మైన‌ వ్యాఖ్య‌ల‌తో ట్రోల్స్ చేయ‌డం వాళ్ల‌కు రొటీనే. ఆ ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వార్ చాలా కాలంగా న‌డుస్తోంది. చాలాసార్లు అది కాస్తా తీవ్ర రూపం దాల్చ‌డంతో ప్ర‌ముఖులు రంగంలోకి దిగి ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్ర‌య‌త్నించాల్సొచ్చింది. అప్ప‌ట్లో సోషల్ మీడియాలో చోటుచేసుకొన్న ఓ చిన్న సంఘటనతో అజిత్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. `రెస్ట్ ఇన్ పీస్ విజ‌య్‌!` అనే వ్యాఖ్య‌కు హ్యాష్ ట్యాగ్ ని జోడించి అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ప్ర‌చారం చేశారు. అయితే ఇలా హ్యాష్ ట్యాగ్ తో ఫ్యాన్స్ చేస్తున్న దాడిపై తమిళనాడుకు చెందిన ప్రముఖ క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్ తీవ్రంగా స్పందించారు. యువతరం పెంకి పనులపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. ఎన్నో సమస్యలు తమిళ ప్రజలను వెంటాడుతుంటే ఫ్యాన్స్ పిచ్చి వేషాలేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ గొడవల్ని స‌రిదిద్దాల‌ని విజయ్.. అజిత్ ల‌కు సూచించారు. మౌనం స‌రికాద‌ని హీరోల‌ను హెచ్చ‌రించారు.

బ‌ర్త్ డే వ‌చ్చిందంటే గ‌డ‌బిడ షురూ!

హీరోల బ‌ర్త్ డే స‌మ‌యంలో ఇది మ‌రీ ఎక్కువ‌. ఒక‌సారి స్టార్ హీరో విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ్యాన్స్ `ద‌ళ‌ప‌తి బిడే సీడీపీ` అంటూ ట్విట్ట‌ర్ ఫేస్ బుక్ లో సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్ చేశారు. అయితే దీనికి కౌంట‌ర్ గా అజిత్ ఫ్యాన్స్ `జూన్ 22 విజ‌య్ డెత్ డే` అంటూ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌డంతో విజ‌య్ ఫ్యాన్స్ హ‌ర్ట‌యిపోయారు. తిరిగి త‌ళా అజిత్ ఫ్యాన్స్ పై కౌంట‌ర్ ని ప్లాన్ చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. అజిత్ ఫ్యాన్స్ నెగెటివిటీని ప్ర‌చారం చేస్తే విజ‌య్ ఫ్యాన్స్ అందుకు భిన్న‌గా కాస్త హుందాగానే వ్య‌వ‌హరిస్తూ `లాంగ్ లివ్ అజిత్ స‌ర్` అంటూ హ్యాష్ ట్యాగ్ తో ప్ర‌చారం చేసారు. ఆ త‌ర్వాత ఇరువురు హీరోల ఫ్యాన్స్ న‌డుమ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది.

టాలీవుడ్ లోనూ ఫ్యాన్ వార్ ..!

నాటి రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి .. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఫ్యాన్స్ మ‌ధ్య వార్ పీక్స్ లో ఉండేది. ఫ్యానిజాన్ని అప్ప‌ట్లో క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకునేవారు. ఆ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యాన్స్ మ‌ధ్య ఆ త‌ర‌హా వార్ కాకుండా బాక్సాఫీస్ లెక్క‌ల‌కు సంబంధించిన ఆరోగ్య‌క‌ర‌మైన వార్ కొన‌సాగింది. కొంత‌వ‌ర‌కూ సోష‌ల్ మీడియాలో అభిమానుల మ‌ధ్య టీజింగ్ ఉన్నా.. మ‌రీ టూమ‌చ్ అవ్వ‌లేదు. అప్ప‌ట్లోనే ప‌వ‌న్ ఫ్యాన్స్ .. ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌ధ్య భీమ‌వ‌రంలో బాహా బాహీ తెలిసిందే. 2022 సంక్రాంతికి మ‌హేష్ వ‌ర్సెస్ ప‌వ‌న్ ఫ్యాన్ వార్ షురూ అయ్యింది. అప్ప‌టికి ప‌రిస్థితి ఎలా ఉండ‌నుందో వేచి చూడాలి.

మ‌నతో పోలిస్తే తంబీల్లో ఫ్యాన్ వార్ డిఫ‌రెంట్. త‌మిళ‌నాట హీరోల‌ ఫ్యాన్స్ మ‌ధ్య వార్ కాస్త తీవ్రంగానే కొనసాగుతోంది. ప్ర‌స్తుతం అభిమానుల మ‌ధ్య వార్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పీక్స్ కి చేరుకుంది. కానీ ఇలాంటివి స‌భ్య స‌మాజానికి అంత మంచిది కాదని నేచుర‌ల్ స్టార్ నాని త‌ర‌హాలో అగ్ర హీరోలు కూడా ముందుకు వ‌చ్చి ఖండించాల్సి ఉంటుంది.