Begin typing your search above and press return to search.

భయంలో నుంచి నన్ను బయటపడేసింది సుకుమార్!

By:  Tupaki Desk   |   17 Dec 2021 4:30 PM GMT
భయంలో నుంచి నన్ను బయటపడేసింది సుకుమార్!
X
అజయ్ ఘోష్ .. నాటకరంగం నుంచి వచ్చిన నటుడు. సినిమా రంగానికి వచ్చిన తరువాత కూడా నాటక రంగంపై మక్కువ తగ్గని నటుడు. ఒక వైపున బుల్లితెరపై అనేక ధారావాహికలలో చేస్తూ, సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ సుదీర్ఘ కాలం పాటు ప్రయాణం చేస్తూ వచ్చిన నటుడు. అలాంటి అజయ్ ఘోష్ కి ఇప్పుడిప్పుడే మంచి ఆఫర్లు వస్తున్నాయి .. అవకాశాలు పడుతున్నాయి. మారుతి దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన 'మంచి రోజులు' వచ్చాయి' సినిమాతో ఆయన ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.

తాజాగా ఆయన 'పుష్ప' సినిమాలోను ఒక ముఖ్యమైన పాత్రను చేశాడు. ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠానాయకుడు కొండారెడ్డి పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో ఈ పాత్రతోనే హీరో చేతులు కలుపుతాడు. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొండారెడ్డి పాత్రను పోషించిన అజయ్ ఘోష్ కి కూడా మంచి పేరు వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " సుకుమార్ గారు ట్రైలర్ కి వాయిస్ నాతోనే చెప్పించారు. 'గోల్డ్ రా ఇది .. భూమ్మీద పెరిగే బంగారం' అంటూ ఆ ట్రైలర్ ఉంటుంది. ఆ నాలుగు ముక్కలను సుకుమార్ గారు నాతో ఓ 50 సార్లు చెప్పించి ఉంటారు.

సుకుమార్ గారు లెక్కల మాస్టారు .. ఆయన ఇది వేరు అంతే. ఆయన ఏ విషయంలోను రాజీ పడరు .. సంతృప్తి చెందరు. ఒకవేళ అలా జరిగిందంటే మనం ఆస్కార్ కొట్టినట్టే. సుకుమార్ గారి కథలన్నీ కూడా జీవితానికి సంబంధించినవి గానే ఉంటాయి .. అదే ఆయన గొప్పతనం. 'రంగస్థలం' చూసిన తరువాత ఒక్కసారిగా ఎవరికివారు తమ మూలాలను వెనక్కి తిరిగి చూసుకున్నారు. అలాంటి సుకుమార్ గారితో .. ఒకానొక సమయంలో నేను 'పుష్ప' సినిమాను చేయనని చెప్పాను. సుకుమార్ గారి సినిమాలో సింగిల్ ఫ్రేమ్ లో కనిపిస్తేచాలు .. సింగిల్ డైలాగ్ చెప్పే ఛాన్స్ వస్తే చాలు అనుకునే నేను, ఈ సినిమాలో నాకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఇస్తే చేయలేనని చెప్పాను.

అప్పుడు నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను. అందులో నుంచి నన్ను బయటపడేసిన దేవదూత సుకుమార్ గారు. కరోనా వచ్చి తగ్గిపోయిన తరువాత నా మానసిక స్థితి భయంకరంగా తయారైపోయింది. ఇల్లు దాటాలంటే భయం .. మనుషులను చూస్తే భయం. ఒంటరిగా ఉండాలంటే భయం. అలాంటి పరిస్థితుల్లో నా నమ్మకంపై కొంతమంది దెబ్బకొట్టారు. అజయ్ ఘోష్ పనైపోయిందని కొంతమంది నవ్వుకుంటూ ఉంటే, నేనేమిటో నిరూపించుకునేలా చేసింది సుకుమార్ గారు. లొకేషన్లో నన్ను మూడ్ లోకి తీసుకురావడానికి డాన్స్ చేసిన గొప్ప వ్యక్తి. తన ప్రాణాలను పణంగా పెట్టి ఆయన ఈ సినిమా చేశాడు" అంటూ చెప్పుకొచ్చాడు.