Begin typing your search above and press return to search.

ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్.. బహు పరాక్

By:  Tupaki Desk   |   18 July 2018 7:17 AM GMT
ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్.. బహు పరాక్
X
మొత్తానికి ఓ చిన్న సినిమా టాలీవుడ్‌ బాక్సాఫీస్ ను షేక్ చేసేస్తోంది. ఆసక్తికర ప్రోమోలతో జనాల్లో క్యూరియాసిటీ తీసుకొచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ థియేటర్లలో అంచనాల్ని మించి ఆడేస్తోంది. పెట్టుబడి మీద ఇప్పటికే కొన్ని రెట్లు వసూలు చేసి సంచలనం రేపింది. వీకెండ్లోనే కాక.. వీక్ డేస్ లో సైతం ఈ చిత్రం ఇరగాడేస్తోంది. ఫుల్ రన్లో రూ.10 కోట్లకు పైగా షేర్ గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగుతోంది. పెద్ద బేనర్లు అతడికి అడ్వాన్సులు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు చెబుతున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ హిందీ రీమేక్ కోసం కూడా ఆఫర్లు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఐతే ‘ఆర్ ఎక్స్ 100’ ఇంత పెద్ద హిట్టయినంత మాత్రాన సినిమా అంతా సవ్యంగా ఉన్నట్లు భావించలేం. ఆ సినిమాలో చాలా లోపాలున్నాయి. అయినా కొన్ని అంశాలు కలిసొచ్చి సినిమా అనూహ్య విజయం సాధించింది. అసలు ఇలాంటి చిన్న సినిమా ప్రేక్షకుల దృష్టిలో పడటం.. రిలీజ్ కు ముందు హైప్ తెచ్చుకోవడం.. అలాంటి ఓపెనింగ్స్ రాబట్టం ఆశ్చర్యకరమైన విషయం. వందలో ఒక సినిమాకు మాత్రమే ఇలా జరుగుతుంటుంది. దీనికి అలాగే కలిసొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా జనాల నోళ్లలో నానడానికి.. యువతలో క్రేజ్ రావడానికి హాట్ హాట్ గా ఉన్న ప్రోమోలే కారణం అన్నది స్పష్టం. అన్నిసార్లూ ఎక్స్ పోజింగ్.. గ్లామర్ అంశాలు జనాల దృష్టిని ఆకర్షించవు. ఐతే అజయ్ భూపతి ఈ విషయంలో కొంచెం డిఫరెంటుగా.. బోల్డ్ గా ఆలోచించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగాడు. ఐతే తన తర్వాతి సినిమాకు కూడా ఇలాగే అతను ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలడా అంటే సందేహమే. ప్రతిసారీ ఒకే స్ట్రాటజీ వర్కవుట్ కాదు.

‘ఆర్ ఎక్స్ 100’లోని బోల్డ్ కంటెంట్.. చివర్లో వచ్చే ట్విస్టు బాగా వర్కవుటయ్యాయి. వీటిని మినహాయిస్తే సినిమాలో చెప్పుకోదగ్గ విషయం లేదు. చాలా చోట్ల దర్శకుడి వైఫల్యం.. అనుభవ లేమి కనిపిస్తాయి. కానీ మిగతా విషయాలు పైసా వసూల్ అనిపించేలా చేయడంతో ఈ లోపాల్ని ప్రేక్షకులు మన్నించేశారు. ఈ సినిమా రివ్యూలకు అతీతంగా ఆడేస్తోంది. అలాగని రివ్యూల్లో పేర్కొన్న లోపాల్ని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ‘ఆర్ ఎక్స్ 100’ విషయంలో జరిగిన మ్యాజిక్ అన్నిసార్లూ జరగదని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈసారి సినిమా తీసేటపుడు అజయ్ భూపతి అప్రమత్తంగా ఉండాలి. స్క్రిప్టు పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలి. దర్శకత్వ లోపాలు బయటపడకుండా జాగ్రత్త పడాలి. తన రెండో సినిమా ‘ఆర్ ఎక్స్ 100’కు భిన్నంగా ఉండేలా చూసుకోవడం కీలకం. మొదట్లో జనాల దృష్టిలో పడేందుకు బూతులు.. డబుల్ మీనింగ్ డైలాగుల మీద దృష్టి పెట్టి బూతు డైరెక్టర్ పేరు పడ్డ మారుతి.. ఆ తర్వాత ఆ ఇమేజ్ ను బ్రేక్ చేసి చక్కటి సినిమాలు తీశాడు. అజయ్ భూపతి కూడా తనపై ఒక ముద్ర లేకుండా చూసుకోవాలి. ఈసారి బోల్డ్ కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం కథాకథనాల మీద ఫోకస్ చేయాలి. జనాల దృష్టిని ఆకర్షించడానికి స్ట్రాటజీలు ప్లే చేయాల్సిన అవసరం లేదు. మంచి అవకాశాలే వస్తాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకుంటూ అజయ్ విషయ ప్రధానంగా సినిమాలు తీస్తాడేమో చూడాలి.