Begin typing your search above and press return to search.

ఆరెక్స్ 100 దర్శకుడి మహా ప్లాన్

By:  Tupaki Desk   |   6 March 2019 9:51 AM IST
ఆరెక్స్ 100 దర్శకుడి మహా ప్లాన్
X
పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సునామీ రేంజ్ లో సంచలన విజయం సాధించిన ఆరెక్స్ 100 విడుదలై ఏడాదికి దగ్గరగా ఉన్నా ఇంకా యూత్ మనసుల్లో సజీవంగా కదలాడుతూనే ఉంది. ఇందు శివ పాత్రలు వాళ్ల మనసులో అంత బలమైన ముద్ర వేశాయి. పిల్లా రా ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ దాటేసి ఔరా అనిపించుకుంది. అందుకే దర్శకుడు అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ ఏంటా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో సైతం ఉంది. నెలలు దాటుతున్నా కొత్త సినిమా మొదలుకాకపోవడం గురించి పలు గుసగుసలు కూడా వినిపించాయి.

అయితే విశ్వసనీయ సమాచారం మేరకు అజయ్ భూపతి ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ తో రాబోతున్నాడట. అదే మహా సముద్రం. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో స్మగ్లింగ్ నేపథ్యంగా తీసుకుని ఇద్దరు హీరోలతో భారీ ఎత్తున దీన్ని ప్లాన్ చేశారట. మహా అంటే హీరోయిన్ పేరు. సమంతా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సముద్రం అంటే ఇద్దరు హీరోల పాత్రల తాలూకు లక్షణం. ఒకడు శాంతంగా ఉంటే మరొకరు అలల తాకిడిలా ఉవ్వెత్తున ఉద్వేగంతో ఎగసిపడుతూ ఉంటాడు. పూర్తి విరుద్ధమైన మనస్తత్వాలు కలిగిన ఈ ఇద్దరికీ మహాకి ఉన్న కనెక్షన్ ఏంటో అదే దీని కథగా చిన్న లీక్ రూపంలో బయటికి వచ్చింది. సముద్రం మెయిన్ ఫోకస్ గా ఉంటుంది కాబట్టి మూవీ థీమ్ ని టైటిల్ లో చూపించేలా మహా సముద్రం అని డిసైడ్ చేసారట.

ఇంతే కాదు ట్విస్టులతో కూడిన అందమైన ప్రేమకథ కూడా ఇందులో ఉంటుందట. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్లాలనే ఉద్దేశంతోనే అజయ్ భూపతి ఇంత ఆలస్యం చేశాడని ఇప్పుడు పక్కాగా అంతా రెడీ కావడంతో మొదలుపెట్టడమే ఆలస్యమని చెబుతున్నారు. ఆరెక్స్ 100 బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన అంచనాలను నిలబెట్టుకోవాలి కాబట్టి అంతకు మించిన సబ్జెక్ట్ ని తెరకెక్కించాలనే ఉద్దేశంతోనే కొంత జాప్యం చేయాల్సి వచ్చిందని అజయ్ భూపతి అంటున్నాడట. ఆ ఇద్దరు హీరోలలో ఒకరు కన్ఫర్మ్ కాగా మరొకరు ఇంకొద్ది రోజుల్లో ఫైనల్ కాబోతున్నారు. ఈ వివరం మాత్రం టీమ్ సస్పెన్స్ లో ఉంచుతోంది. మొత్తానికి ఆరెక్స్ 100 బైక్ పై ప్రేమ ప్రయాణం చేయించిన అజయ్ భూపతి ఇప్పుడు సముద్రంపై తీసుకెళ్లబోతున్నాడు.