Begin typing your search above and press return to search.

#MAAELECTIONS : నాకూ 'మా' ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుంది

By:  Tupaki Desk   |   7 Oct 2021 7:48 AM GMT
#MAAELECTIONS  : నాకూ మా ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుంది
X
గతంలో ఎప్పుడూ లేని విధంగా 'మా' ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్‌ రాజ్ మరియు మంచు విష్ణు లు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. రాజకీయ ఎన్నికలను తలపిస్తున్న మా ఎన్నికలను చూసి ఇండస్ట్రీ వర్గాల వారు స్వయంగా చీదరించుకుంటున్నారు. మరీ ఇంతలా దిగజారి సెలబ్రెటీలు వ్యాఖ్యలు చేయడం.. మా ఎన్నికలు ఏ స్థాయికి దిగజారాయో చెప్పకనే చెబుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మా ఎన్నికలను ఈసడించుకుంటున్నారు. కాని బయటకు మాత్రం మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. కొందరు మాత్రం ఇండైరెక్ట్‌ గా పంచ్‌ లు వేస్తున్నారు. స్టార్స్ అసలు ఓటింగ్‌ కు వచ్చేందుకు సిద్దంగా లేమని చెబుతున్నారు. తాజాగా దర్శకుడు అజయ్‌ భూపతి ఈ విషయమై స్పందించాడు.

ఈయన దర్శకత్వంలో రూపొందిన మహా సముద్రం విడుదలకు సిద్దం అయ్యింది. రెండవ సినిమా అయినా కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి సినిమా ఆర్‌ ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న అజయ్ భూపతి చాలా గ్యాప్ తీసుకుని మహా సముద్రంను శర్వానంద్ మరియు సిద్దార్థ్‌ లతో చేశాడు. వర్మ శిష్యుడు అయిన అజయ్ భూపతి వ్యాఖ్యలు చాలా బోల్డ్‌ గా ఉంటాయి. గురువు నుండి నేర్చుకున్నాడా లేదంటే సొంతంగానే అతను అలాంటి వ్యక్తా అనే విషయం పక్కన పెడితే పలు సందర్బాల్లో చాలా బోల్డ్‌ గా వ్యాఖ్యలు చేశాడు. తాజాగా మరోసారి మా ఎన్నికల గురించి తన లో ఉన్న ఫీలింగ్‌ ను చెప్పేసి మా ఎన్నికలు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సోషల్‌ మీడియాలో అజయ్ భూపతి.. మా ఎన్నికల సందర్బంగా జరుగుతున్న ఈ థ్రిల్లింగ్‌ ఎపిసోడ్స్ ను చూస్తుంటే నాక్కూడా మా ఎన్నికలపై ఆసక్తి కలుగుతుంది. రెండు మూడు సినిమాల్లో నటించి మా కార్డును తీసుకొని మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయాలని ఉంది అంటూ ట్వీట్‌ చేశాడు. పని పాట లేని వారు.. ఒకటి రెండు సినిమాల్లో నటించి ఖాళీగా ఉన్న వారు ప్రస్తుతం మా ఎన్నికల బరిలో హడావిడి చేస్తున్నారు అనేది చాలా మంది కామెంట్స్‌. ఇప్పుడు దర్శకుడు అజయ్ భూపతి వ్యాఖ్యలు చూస్తున్నా అలాగే అనిపిస్తున్నాయి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా మా ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఈనెల 10వ తారీకు తర్వాత ఈ వ్యవహారం ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మా ఎన్నికల హడావుడి అయిన తర్వాత మా సినిమా విడుదల కాబోతుంది. అక్టోబర్ 14న విడుదల కానున్న మా మహాసముద్రం సినిమాను చూసి ఎంజాయ్‌ చేయండి అంటూ అజయ్‌ భూపతి మరో ట్వీట్‌ లో పేర్కొన్నాడు.