Begin typing your search above and press return to search.

ఐదేళ్ల తరువాత ఐష్‌ హంసనడకలు

By:  Tupaki Desk   |   15 July 2015 10:33 PM IST
ఐదేళ్ల తరువాత ఐష్‌ హంసనడకలు
X
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌ ఇటీవలి కాలంలో సంసార జీవనంలో తలమునకలై అన్నిటినీ వదిలేసింది. ఆరాధ్యకు తల్లి అయ్యాక గారాల పట్టీ ఆలనా పాలనలోనే కాలాన్ని గడిపేసింది. అయితే ఆరాధ్య పెద్దదైపోతోంది.. కాబట్టి ఇక తనకి రిలీఫ్‌ దొరికినట్టేనని భావించిన ఐష్‌ మరోసారి ముఖానికి రంగేసుకుని నటించడానికి రెడీ అయ్యింది.

ఇప్పటికిప్పుడు ఓ రెండు ప్రాజెక్టుల్లో నటిస్తూ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. ఇది ఘనమైన రీఎంట్రీ అని చాటుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న ఈ టైమ్‌లోనే కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై నడిచి అందరికీ షాకిచ్చింది. ఓ ఆంటీ ఈ రేంజులో అందాలు ఆరబోయడమేంటి? అన్న విమర్శలొచ్చినా ఐష్‌లో బిగి సడలలేదని మెచ్చుకున్నారంతా. కేన్స్‌ తర్వాత మరోసారి ర్యాంప్‌ వాక్‌తో అలరించడానికి రెడీ అవుతోంది.

ఈ నెలాఖరున కౌచర్‌ వీక్‌ పేరుతో న్యూఢిల్లీలో జరగనున్న ర్యాంప్‌ షోలో ఐష్‌ పాల్గొనబోతోంది. దీనికి మనీష్‌ మల్హోత్రా డిజైనింగ్‌ చేయబోతున్నారు. వాస్తవానికి ఐదేళ్లుగా ఐశ్వర్యారాయ్‌ ర్యాంప్‌ వాక్‌లకు పూర్తిగా దూరమైంది. ఇటీవలే మనసు మార్చుకుని తిరిగి పాతనే కొత్తగా తిరగతోడుతోంది.