Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో తెగ సందడి చేసున్న ఐష్ - త్రిష సెల్ఫీ!

By:  Tupaki Desk   |   23 Sep 2022 3:34 AM GMT
సోషల్ మీడియాలో తెగ సందడి చేసున్న ఐష్ - త్రిష సెల్ఫీ!
X
ఇప్పుడు అంతా కూడా 'పొన్నియిన్ సెల్వన్' సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇంతవరకూ మణిరత్నం స్నేహం .. ప్రేమ .. త్యాగం .. దేశభక్తి నేపథ్యంలో కథలను తెరకెక్కిస్తూ వచ్చారు. ఈ సారి ఆయన చారిత్రక నేపథ్యంతో కూడిన కథను ఎంచుకున్నారు. ఆ సినిమా పేరే 'పొన్నియిన్ సెల్వన్'. చోళరాజుల కాలం .. అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇంతవరకూ తమిళం నుంచి వచ్చిన అత్యంత భారీ చిత్రాల జాబితాలో ఇది ఒకటిగా కనిపించనుంది. కథాకథనాల పరంగా చూసుకుంటే ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలవనుంది.

లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో మణిరత్నం కూడా ఒక భాగంగా ఉన్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినిమా ప్రేమికులు ఆసక్తితో ఉన్నారు.

అలాంటి ఈ సినిమాలో భారీతారాగణం ఉంది. ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉండేలా చూస్తూ .. ఆ పాత్రల వేషధారణను డిఫరెంట్ గా డిజైన్ చేయించారు. అందువల్లనే ప్రతి పోస్టర్ కూడా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమాలో మొదటి భాగాన్ని ఈ నెల 30వ తేదీన థియేటర్లలో వదులుతున్నారు.

ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ - త్రిష ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 'కుందవై' అనే పాత్రలో త్రిష కనిపించనుంది. ఐశ్వర్యరాయ్ కాంబినేషన్లో తన సీన్స్ చాలానే ఉన్నాయనీ, ఆ సీన్స్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయని త్రిష మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఐశ్వర్య రాయ్ తో కలిసి నటించిన క్షణాలను తన లైఫ్ లో మరిచిపోలేనని చెప్పుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో త్రిష బిజీగానే ఉంది. ఐశ్వర్య రాయ్ మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు. ఆమె కూడా ఇక ప్రమోషన్స్ లో పాల్గొననుందని అంటున్నారు.

షూటింగు సమయంలో ఐశ్వర్యారాయ్ .. త్రిష సెల్ఫీ తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్నవారు తమ కెమెరాను క్లిక్ మనిపించారు. ఈ ఇద్దరి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐశ్వర్య రాయ్ కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఈ మధ్యనే మళ్లీ కెమెరా ముందుకు రావడానికి ఒప్పుకుంటున్నారు. అలాంటి ఆమె మణిరత్నం కథ చెప్పగానే ఒప్పుకున్నారంటే ఈ సినిమాలో బలమైన విషయం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ, ఇది తమ కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా చెబుతుండటం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.