Begin typing your search above and press return to search.

గూఢ‌చారి లానే ఏజెంట్ ఆత్రేయ‌ ఫ్రాంఛైజీ!

By:  Tupaki Desk   |   7 July 2019 4:31 AM
గూఢ‌చారి లానే ఏజెంట్ ఆత్రేయ‌ ఫ్రాంఛైజీ!
X
గూఢ‌చారి.. ఏజెంట్ ఆత్రేయ సినిమాల‌తో టాలీవుడ్ లో కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టార‌ని భావించ‌వ‌చ్చు. బాండ్ 007... డిటెక్టివ్ క‌థ‌ల‌కు ఇది ఊతం అనే చెప్పాలి. మ‌రోసారి ఈ త‌ర‌హా క‌థ‌ల‌కు డిమాండ్ పెరిగింది. ఈ రెండు విజ‌యాల‌తో ఫ్రాంఛైజీలకు రూప‌క‌ల్ప‌న చేస్తుండ‌డం ఎగ్జ‌యిట్ మెంట్ పెంచుతోంది. ఇప్ప‌టికే అడివి శేష్ గూఢ‌చారి సీక్వెల్ క‌థ‌ను రెడీ చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. 2020లో ఈ సీక్వెల్ సెట్స్ కెళుతుంద‌న్న క్లూ కూడా ఇచ్చారు. ఆ క్ర‌మంలోనే గూఢ‌చారి ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెరిగింది. ప‌రిమిత బ‌డ్జెట్ల‌తోనూ పెద్ద రేంజు స‌క్సెస్ అందుకోవ‌చ్చ‌ని గూఢ‌చారి నిరూపించ‌డంతో ప‌రిశ్ర‌మ‌లో కొత్త పంథా ఆలోచ‌న‌ల‌కు తావిచ్చింది. లేటెస్ట్ గా `ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ` ప‌రిమిత బ‌డ్జెట్ తో తెర‌కెక్కి విజ‌యం అందుకోవ‌డం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ఉత్సాహం నింపుతోంది.

సైలెంటుగా వ‌చ్చి ఆత్రేయ డీసెంట్ హిట్ కొట్ట‌డంపై ట్రేడ్ లో ముచ్చ‌ట సాగుతోంది. తాజా స‌క్సెస్ మీట్ లో డైరెక్ట‌ర్ స్వ‌రూప్ రాజ్ మాట్లాడుతూ ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయకు సీక్వెల్ ఉంటుంద‌ని.. దీనిని ఫ్రాంఛైజీగా ర‌న్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. డిజిట‌ల్ మాధ్య‌మం పెరిగిన త‌ర్వాత కూడా మా సినిమా మూడో వారం విజ‌య‌వంతంగా ర‌న్ అవుతుండ‌టం ఆనందంగా ఉంది. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయకు పార్ట్ 2 ఎప్పుడు ఉంటుంది? అని చాలా మంది అడిగారు. మేం ఉన్నంత కాలం ఈ సినిమాకు ఫ్రాంచైజీ ర‌న్ చేస్తూనే ఉంటామ‌ని స్వ‌రూప్ రాజ్ తెలిపారు.

అస‌లు రెండు మూడు థియేటర్లు అయినా దొరుకుతాయో లేదోనని సందేహిస్తే 60-70 థియేట‌ర్ల‌లో షో వేయ‌డ‌మే గాక‌.. విజ‌య‌వంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టామ‌ని హీరో న‌వీన్ పోలిశెట్టి ఆనందం వ్య‌క్తం చేశారు. ఫ్రాంఛైజీ ఆలోచ‌న‌తో ఉత్సాహంగా ఉన్నామ‌న్నారు. 80-90ల‌లో గూఢ‌చారి .. డిటెక్టివ్ త‌ర‌హా సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేవారు. మ‌రోసారి నాలుగు ద‌శాబ్ధాల‌కు మ‌ళ్లీ అదే త‌ర‌హా ఒర‌వ‌డి టాలీవుడ్ లో పుట్టుకురావ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. ఓవైపు డేనియ‌ల్ క్రెయిగ్ హీరోగా హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సిరీస్ లో కొత్త సినిమా తెర‌కెక్కుతున్న వేళ .. టాలీవుడ్ లో ఈ త‌ర‌హా చ‌ర్చ సాగ‌డం క్రేజీ ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచుతోంది.