Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఏజెంట్

By:  Tupaki Desk   |   28 April 2023 4:01 PM
మూవీ రివ్యూ : ఏజెంట్
X
'ఏజెంట్' మూవీ రివ్యూ
నటీనటులు: అక్కినేని అఖిల్-సాక్షి వైద్య-మమ్ముట్టి-డినో మోరియా-సంపత్-వరలక్ష్మి శరత్ కుమార్-మురళీ శర్మ-పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: హిప్ హాప్ తమిళ
ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్
నిర్మాత: అనిల్ సుంకర
కథ: వక్కంతం వంశీ
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సురేందర్ రెడ్డి

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో కెరీర్లో తొలి విజయాన్నందుకున్న యువ కథానాయకుడు అఖిల్.. ఈసారి పూర్తి మాస్ అవతారంలో.. యాక్షన్ జానర్లో చేసిన భారీ చిత్రం 'ఏజెంట్'. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను 'ఏజెంట్' ఏమేర అందుకుందో చూద్దాం పదండి.


కథ:

రామకృష్ణ అలియాస్ రిక్కీ (అఖిల్ అక్కినేని)కి చిన్నప్పట్నుంచి సీక్రెట్ ఏజెంట్ కావాలని కల. అందుకోసమే అన్ని విద్యలూ నేర్చుకుని.. ఒకటికి మూడుసార్లు 'రా' పరీక్ష రాస్తాడు. కానీ ప్రతిసారీ అతడికి తిరస్కారమే ఎదురవుతుంది. చివరికి 'రా'ను నడిపించే మహదేవ్ అలియాస్ డెవిల్ (మమ్ముట్టి) సిస్టం హ్యాక్ చేసి ఆయన్ని తన దగ్గరికే రప్పించుకుని తనకు స్పైగా అవకాశం ఇవ్వమని కోరుతాడు. కానీ స్పైకి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా నీలో లేదంటూ డెవిల్ కూడా రిక్కీని రిజెక్ట్ చేస్తాడు. కానీ తర్వాత ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ సిండికేట్ ను నడిపిస్తూ ఇండియాతో పాటు ప్రపంచంలో అనేక దేశాలకు అతి పెద్ద ముప్పుగా మారిన 'గాడ్' (డినో మోరియా)ను దెబ్బ కొట్టడానికి రిక్కీనే ఏజెంట్ గా నియమిస్తాడు మహదేవ్. అందుకు దారి తీసిన పరిస్థితులేంటి.. గాడ్ నేపథ్యం ఏంటి.. అతణ్ని రిక్కీ ఎలా ఎదుర్కొన్నాడు.. తన మిషన్ని ఎలా పూర్తి చేశాడు అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

హీరో తనకు తాను చాలా 'వైల్డ్' అని చెప్పుకుంటూ ఉంటాడు. తండ్రి కూడా అతణ్ని చూసి ఇంత వైల్డ్ గాడు పుట్టాడేంటి నాకు అంటుంటాడు. ఇక హీరోయిన్ కూడా హీరోను చూసిన తొలి చూపులోనే 'వైల్డ్ సాలా' అంటుంది. చివరికి 'రా' చీఫ్ సైతం హీరోను చూసి వీడేంటి ఇంత వైల్డ్ గా ఉన్నాడు అంటాడు. విలన్ సైతం పదే పదే హీరోను చూసి వైల్డూ వైల్డూ అని పలవరిస్తూ ఉంటాడు. ఇది చాలదన్నట్లు హీరో తనకు తాను ''నేను అన్ ప్రెడిక్టబుల్.. నెక్స్ట్ నేనేం చేస్తానో నాకే తెలియదు'' అంటాడు. సినిమాలోని పాత్రలన్నీ కూడా ''వీడు అన్ ప్రెడిక్టబుల్'' అని ఒకటే ఊదరగొట్టేస్తుంటాయి. హీరో విన్యాసాలు చూసి వీడేంట్రా ఇంత వైల్డ్ గా ఉన్నాడు.. ఇంత అన్ ప్రెడిక్టబుల్ పనులు చేస్తున్నాడు అని చూసే ప్రేక్షకుడు అనుకోవాలి కానీ.. ఇలా సినిమాలో ప్రతి పాత్రతోనూ ఊదరగొట్టించి మనతోనూ ఒప్పించడానికి ప్రయత్నించడంలోనే 'ఏజెంట్' ఎంత ఇల్లాజికల్ మూవీ అనేది అర్థం చేసుకోవచ్చు. పాపం అఖిల్ పది నెలల పాటు చాలా కష్టపడి బాడీ పెంచి ఉండొచ్చు.. ఎంతో తపనతో అవతారం మార్చుకుని ఉండొచ్చు.. కానీ అతడి లుక్ లాగే సినిమా కూడా కృత్రిమంగా తయారైంది అన్నది కఠిన వాస్తవం.

'ఏజెంట్' సినిమాలో హీరోకు చిన్నప్పట్నుంచే ఏజెంట్ కావాలని పిచ్చి. ఆ లక్ష్యంతో ఏవేవో భాషలు నేర్చేసుకుంటాడు. ఏవేవో విద్యలు వంటబట్టించుకుంటాడు. ఎన్నెన్నో విన్యాసాలు చేస్తాడు. చివరికి చూస్తే నీలో ఒక స్పైకి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదు అని తీసి పారేస్తాడు 'రా' చీఫ్. స్పై థ్రిల్లర్ అని చెప్పుకున్న 'ఏజెంట్' సినిమా చూస్తుంటే.. ఒక స్పై థ్రిల్లర్ కు ఉండాల్సిన లక్షణాలేవీ లేవనిపిస్తుంది. పనిగట్టుకుని స్పై ఎలా ఉంటాడో దానికి పూర్తి వ్యతిరేకంగా అఖిల్ పాత్రను తీర్చిదిద్దినట్లున్నారు రైటర్ వక్కంతం వంశీ.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి. స్పై అంటే గుంభనంగా ఉంటూ ఏ హడావుడి లేకుండా తన పని తాను చేసుకుపోతాడని.. ఇంటలిజెంట్ గా మిషన్ పూర్తి చేస్తాడు అనే అంచనాల్లో మనం ఉంటే.. ఇందులో ఏమో హీరో నేను స్పై అవుతా.. నేను స్పై అవుతా అని చిన్న పిల్లాడిలా ఊగిపోతూ ఉంటాడు. తనను 'రా' ఇంటర్వ్యూల్లో రిజెక్ట్ చేసేసరికి ఇక లాభం లేదని.. ఏకంగా 'రా' చీఫ్ సిస్టంనే సింపుల్ గా హ్యాక్ చేసి పడేస్తాడు. ఆ చీఫ్ ఏదో మాట వరసకి ఒక వ్యక్తిని చూపించి.. అతణ్ని చంపమంటే చంపుతావా అని పక్కకు తిరిగితే క్షణాల్లో చంపేసి వచ్చేస్తాడు. ఇదంతా చూసి ఇంప్రెస్ అయి 'రా' చీఫ్ అతణ్ని ఏజెంటుగా అపాయింట్ చేసి పడేస్తాడు. ఇక మిషన్లో భాగంగా ఆ చీఫ్.. ఒక మంత్రితో స్నేహం చెయ్యమని అంటే.. టపీమని ఆ మంత్రిని.. అతడితో పాటు ఉన్న పెద్ద రౌడీ గ్యాంగుని కాల్చి పడేసి వచ్చేస్తాడు. ఎదురుగా పదుల సంఖ్యలో రౌడీలు మెషీన్ గన్నులు పట్టుకుని తనను టార్గెట్ చేస్తుంటే.. హీరో చేతిలో చిన్న గన్నులు రెండు పట్టుకుని స్టెప్పులేసుకుంటూ అందరినీ కాల్చి పడేయడం ఏదైతే ఉందో.. అది అతికే అతి. ఏదో క్రేజీగా చేస్తున్నాం.. ప్రేక్షకులకు పిచ్చెక్కించేస్తున్నాం అని 'ఏజెంట్' టీం అనుకుని ఉండొచ్చుగాక.. కానీ చూసే వాళ్లకు మాత్రం ఇదంతా సిల్లీగా.. కామెడీగా అనిపించి నవ్వొస్తుంది.

మాస్.. యాక్షన్ సినిమాల్లో లాజిక్కుల గురించి ఆలోచించకూడదన్న మాట అర్థం చేసుకోదగ్గదే కానీ.. 'ఏజెంట్'లో మాత్రం కథతో పాటు.. పాత్రలు.. సన్నివేశాలు.. ఇలా అన్నీ కూడా మరీ ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. ఈ కథకు కేంద్ర బిందువు విలన్ పాత్ర. ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దడంలోనే సినిమా తేడా కొట్టేసింది. అనాథగా ఉన్న అతణ్ని 'రా' చీఫ్ చేరదీసి నంబర్ వన్ ఏజెంటుగా తీర్చిదిద్దితే.. అతనేమో చివరికి అత్యంత ప్రమాదకర మాఫియా డాన్ అవుతాడు. ఇందుకు కారణం ఏంటయ్యా అంటే.. తను ఇష్టపడ్డ అమ్మాయి శత్రు దేశపు ఏజెంట్ అని గుర్తించి చీఫ్ ఆమెను చంపేయమనడమే. సిన్సియర్ ఏజెంట్ అయిన అతను.. తన చేతులతోనే ఆ అమ్మాయిని చంపుతాడు. కానీ చిత్రంగా చీఫ్ మీద పగబట్టి మాఫియా డాన్ అయిపోతాడు. ఇందులో లాజిక్ ఏంటో అర్థం కాదు. ఇలాంటి వాడి మీదికి తనేం చేస్తాడో తనకే తెలియని హీరోను దించుతాడు చీఫ్. అసలు హీరో ఎప్పుడేం చేస్తాడో.. అందులో లాజిక్ ఏంటో అర్థం కాదు. విలన్ ఉద్దేశాలు అంతుబట్టవు. ఇక 'తుపాకి' సినిమాలో స్లీపర్ సెల్స్ తరహాలో ఏదో 'సూపర్ సెల్స్' పేరుతో జరిగిన హడావుడి.. దాని చుట్టూ నడిపిన డ్రామా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రథమార్ధంలో కథలో అంతో ఇంతో ఆసక్తి ఉంది. కొన్ని ఎపిసోడ్ల వరకు ఎంగేజ్ చేస్తాయి. కానీ హీరో మిషన్లోకి దిగాక అతను చేసే విన్యాసాలు.. తెర మీద జరిగే విధ్వంసాలనైతే భరించడం చాలా కష్టం. అసలు కథ ఎటు పోతోందో.. ఏ పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కాక తల పట్టుకోవాల్సిందే. ఒక దశ దాటాక కథలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా చచ్చిపోయి.. ముగింపు కోసం ఎదురు చూడటమే మిగులుతుంది. క్లైమాక్స్ అయితే మరీ పేలవంగా తయారై శిరోభారాన్ని మరింత పెంచుతుందే తప్ప సినిమా మీద ఇంప్రెషన్ ఏమాత్రం మార్చదు. మొత్తంగా చెప్పాలంటే.. అవసరం లేని భారీతనంతో చేసిన ఒక వ్యర్థ ప్రయత్నం 'ఏజెంట్'.


నటీనటులు:

అక్కినేని అఖిల్ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. బహుశా తెలుగులో ఏ హీరో కూడా ఒక పాత్ర కోసం తన అవతారాన్ని ఇంతలా మార్చుకుని ఉండకపోవచ్చు. కానీ కఠిన వాస్తవం ఏంటంటే.. చాక్లెట్ బాయ్ లా కనిపించే అఖిల్ కు ఆ అవతారం సూట్ కాలేదు. కేవలం ఇలా లుక్ మార్చుకుంటే మాస్ ఇమేజ్ వచ్చేయదని అఖిల్ గుర్తిస్తే మంచిది. నటన పరంగా అఖిల్ కు యావరేజ్ మార్కులు పడతాయి. హావభావాలు.. డైలాగ్ డెలివరీ విషయంలో అతను మెరుగు పడాల్సి ఉంది. హీరోయిన్ సాక్షి వైద్య చూడ్డానికి అందంగా ఉంది. తన యాక్టింగ్ స్కిల్స్ చూపించే అవకాశం సినిమా ఇవ్వలేదు. మమ్ముట్టి తన స్థాయికి తగని పాత్ర చేశాడిందులో. అన్ని విషయాల్లో 'అతి'గా అనిపించే సినిమాలో మమ్ముట్టి ఒక్కడే నార్మల్ మీటర్లో నటించాడు. తన పాత్ర తేలిపోయినా.. మమ్ముట్టి వరకు తన నటన.. స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎంగేజ్ చేశాడు. విలన్ పాత్రకు డినో మోరియా సరైన ఛాయిస్ అనిపించడు. అతడితో ఏమాత్రం కనెక్ట్ కాలేం. మురళీ శర్మ.. వరలక్ష్మి శరత్ కుమార్.. పోసాని.. సంపత్.. వీళ్లంతా సినిమాలో ఉన్నామంటే ఉన్నాం అనిపించారు.


సాంకేతిక వర్గం:

హిప్ హాప్ తమిళ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టరే. కానీ 'ఏజెంట్'కు అతడి సంగీతం అతి పెద్ద మైనస్ అయింది. అతడి పాటలు ఒక్కటీ ఆకట్టుకోవు. ఇలాంటి పాటలు అతనెలా ఇచ్చాడో.. సురేందర్ రెడ్డి ఎలా ఓకే చేశాడో అర్థం కాదు. ఆడియోలో కంటే తెర మీద భరించలేని స్థాయిలో ఉన్నాయి పాటలు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్ అయితే టార్చర్ పెడుతుంది. హిప్ హాప్ తమిళ నేపథ్య సంగీతం కూడా సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. స్కోర్ చాలా చోట్ల చికాకు పెడుతుంది. రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువల విషయంలో అనిల్ సుంకర ఏమాత్రం రాజీ పడలేదు. విపరీతంగా ఖర్చు పెట్టాడు. అదంతా తెరపై కనిపిస్తుంది. ఒక పెద్ద స్టార్ సినిమా స్థాయిలో ప్రొడక్షన్ డిజైన్ కనిపిస్తుంది. కానీ సురేందర్ రెడ్డి దేన్నీ సరిగా ఉపయోగించుకోలేదు. వక్కంతం వంశీ కథలోనేే చాలా లోపాలున్నాయి. ఏమాత్రం బిగి లేని.. ఇల్లాజికల్ కథను రాసుకుని.. దాన్ని అంతే ఇల్లాజికల్ గా తీశాడు సురేందర్ రెడ్డి. స్పై థ్రిల్లర్లకు ఇలాంటి ఓవర్ ద టాప్ నరేషన్ ఏమాత్రం సూట్ కాదు. తుపాకి, గూఢచారి లాంటి సినిమాలు చూసి స్పై థ్రిల్లర్లంటే ఇలా ఉండాలనుకుంటాం. ఈ జానర్ సినిమాలు ఎలా ఉండకూడదో 'ఏజెంట్'ను ఉదాహరణగా చూపించేలా సురేందర్ రెడ్డి 'పనితనం' చూపించాడు. తన కెరీర్లో అత్యంత దిగువన నిలిచే చిత్రాల్లో 'కిక్-2' సరసన 'ఏజెంట్' నిలుస్తుందనడంలో సందేహం లేదు.

చివరగా: ఏజెంట్.. మిషన్ మిస్ ఫైర్ అయింది

రేటింగ్-2/5


Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater