Begin typing your search above and press return to search.

#ఏజెంట్‌.. వెర్రి అభిమానికి అలా బుద్ధి చెప్పాడు!

By:  Tupaki Desk   |   20 April 2022 4:44 AM GMT
#ఏజెంట్‌.. వెర్రి అభిమానికి అలా బుద్ధి చెప్పాడు!
X
అభిమానం అనే పిచ్చి ప్ర‌కోపిస్తే అది ఏ ర‌కంగా అయినా మారుతుంది. కొన్ని సార్లు ప్ర‌మాదాల్ని కూడా కొని తెస్తుంది. అభిమానం ఉండ‌టం త‌ప్పేమీ కాదు కానీ .. స్టార్ల‌ను దేవుళ్లుగా కొలిచేస్తూ అభిమానులు త‌మ‌ని తాము మ‌రిచి త‌మ కుటుంబాల్ని విడిచి చేసే ప‌నులే చికాకు పుట్టిస్తాయి. అదంతా స‌రే కానీ అక్కినేని అభిమానికి ప్ర‌ముఖ నిర్మాత అనీల్ సుంక‌ర క్లాస్ తీస్కున్నారు. అయితే ఆయ‌న స‌రైన పంథాలోనే క్లాస్ తీస్కున్నార‌న్న ప్ర‌శంస‌లు సోష‌ల్ మీడియాల్లో క‌నిపిస్తున్నాయి.

అస‌లింత‌కీ ఏమైంది? ఎవరా వెర్రి అభిమాని? అంటే.. అఖిల్ అక్కినేని తాజా చిత్రం 'ఏజెంట్' బ్లాక్ బస్టర్ విజయం సాధించాల‌ని ప్రార్థించడానికి మోకాళ్లపై సింహాచలం ఆలయ మెట్లు ఎక్కాడు ఒక అభిమాని.

ఆయన గుడి మెట్లు ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోని వీక్షించిన 'ఏజెంట్' నిర్మాత అనిల్ సుంకర అత‌డి వెర్రి అభిమానాన్ని ప్ర‌శంసిస్తూనే లైట్ గా క్లాస్ తీస్కున్నారు. ''మీ ప్రేమకు మేం ఆశ్చర్యపోయాం. అయితే దయచేసి అదే దృఢ సంకల్పం .. మీరు ఎదిగేందుకు చూపించండి. మీ కెరీర్ లో కూడా బావుండాలి. మా ఏజెంట్ ను బ్లాక్ బస్టర్ గా మ‌ల‌చ‌డానికి మీ సంకల్పమే మా ప్రేరణ'' అని అన్నారు.

పొగిడేస్తూనే తిట్ట‌డం ఎలానో అనీల్ సుంక‌ర ప్ర‌తిభావంతంగా చూపించారు. నిజ‌మే .. మ‌రీ అలా మోకాలి చిప్పలు అరిగిపోయేంత అభిమాన‌మా? అంటూ ఇప్పుడు నెటిజ‌నులు కూడా అనీల్ సుంక‌ర చేసిన ప‌నికి మ‌ద్ధ‌తుగా నిలుస్తున్నారు. ఏదేమైనా కానీ అభిమానులూ కాస్త‌యినా ఆలోచించండి. మీ కెరీర్ ని వ‌దిలేసి కుటుంబాన్ని గాలికి వ‌దిలేసి ప్ర‌ద‌ర్శించే వెర్రి అభిమానాలు ఎవ‌రినీ సంతోష పెట్ట‌లేవు.

అందుకే ఆయ‌న అలా క్లాస్ తీస్కున్నారు. తమ తల్లిదండ్రులను కెరీర్ ను విస్మరించి ఇలాంటి తెలివితక్కువ కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌నేది దీని సందేశం. అఖిల్ తొలి మూడు ప‌రాజ‌యాల త‌ర్వాత క‌సిగా హిట్టు కొట్టాల‌ని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చేశాడు. కానీ ఆ క్రెడిట్ అత‌డికి ద‌క్క‌లేదు.

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కొట్టేసింది. అందుకే ఇప్పుడు ఏజెంట్ తో అత‌డు సోలోగా నిరూపించాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీ కోసం అఖిల్ చేయాల్సిందంతా చేస్తున్నాడు. స్పై ఏజెంట్ పాత్ర కోసం అత‌డు మాన్ స్టార్ లా బీస్ట్ లా మారాడు. దానికోసం ఎంతో శ్ర‌మించాడు. సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా మారుస్తాడా.. ఏం చేస్తాడు? అన్న‌ది కాస్త వేచి చూడాలి.