Begin typing your search above and press return to search.

రియల్ హీరో.. సినిమా హీరో అయ్యాడు

By:  Tupaki Desk   |   30 Jun 2017 5:00 AM GMT
రియల్ హీరో.. సినిమా హీరో అయ్యాడు
X
అద్నాన్ సమి ఎంత మధురంగా పాటలు పాడతాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే అద్నాన్ పాట కంటే కూడా అతడి నేపథ్యం.. అతడి ఎదుగుదల.. జీవితంలో ఎదురైన పెద్ద పెద్ద కష్టాల్ని అతను ఎదుర్కొన్న తీరు మరింత గొప్పగా అనిపిస్తాయి. ఈ రియల్ హీరో ఇప్పుడు సినిమా హీరో అవుతున్నాడు. ‘అఫ్ఘాన్: ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ హోం’ పేరుతో అద్నాన్ సమి హీరోగా ఓ సినిమా మొదలైంది. ఈ సినిమా కోసం గడ్డం పెంచి సరికొత్తగా తయారయ్యాడు అద్నాన్. ఈ సినిమా అద్నాన్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అంటున్నారు. అనేక మలుపులున్న అద్నాన్ కథతో సినిమా తీస్తే జనాలకు బాగానే కనెక్టయ్యే అవకాశముంది.

అద్నాన్ అఫ్గానిస్థాన్ తండ్రికి.. పాకిస్థానీ తల్లికి పుట్టాడు. అతను జన్మించింది లండన్లో. అక్కడే చదువుకున్నాడు. ఐదో ఏటే పియానో వాయించి తనలోని సంగీత ప్రతిభను చాటుకున్న అద్నాన్.. చిన్న వయసులోనే సొంతంగా ఆల్బమ్ రెడీ చేశాడు. అది బ్రిటన్లో సంచలనం సృష్టించింది. తర్వాత ఆశా భోంస్లే ఆల్బం ఒకదాంట్లో ఒక పాట పాడి భారతీయ శ్రోతల్ని ఉర్రూతలూగించాడు. ఆ తర్వాత ‘లగాన్’తో మొదలుపెట్టి ఇండియన్ సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడాడు. తెలుగులోనూ ‘వర్షం’ నుంచి ‘ఊసరవెల్లి’ వరకు కొన్ని సినిమాల్లో పాటలు పాడి అలరించాడు. ఐతే అద్నాన్ ఒకప్పుడు 250 కిలోల బరువుండి.. కదలడానికే కష్టపడే దుస్థితిని ఎదుర్కొన్నాడు. ఒకరి తర్వాత ఒకరు.. ముగ్గురు భార్యలు అతడిని విడిచి వెళ్లిపోయారు. అలాగే అతను ఎంతగానే ఇష్టపడే తండ్రి క్యాన్సర్ కారణంగా చనిపోయాడు. ఈ ప్రతికూల పరిస్థితులన్నింటినీ అతను మనో ధైర్యంతో అధిగమించాడు. ఎంతో కష్టపడి.. సర్జీలు చేయించుకుని బరువు తగ్గి మామూలు మనిషి అయ్యాడు. మొత్తంగా అద్నాన్ జీవితంలో మలుపులెన్నో ఉన్నాయి. మరి అతడు హీరోగా రాబోతున్న సినిమా ప్రేకకులకు ఎలాంటి అనుభూతినిస్తుందో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/