Begin typing your search above and press return to search.

లవ్ లో దెబ్బతిన్నాను .. అందుకే పెళ్లి ఆలస్యం!

By:  Tupaki Desk   |   18 Jun 2022 4:14 AM GMT
లవ్ లో దెబ్బతిన్నాను .. అందుకే పెళ్లి ఆలస్యం!
X
టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలతో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన చాలామంది, ఆ తరువాత స్టార్ హీరోలుగా ఎదిగారు. అడివి శేష్ ఆ దిశగా అడుగులు వేస్తూ వస్తున్నాడు. చాలాకాలం క్రితమే నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన అడివి శేష్, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాడు. చిన్న పాత్రల నుంచి హీరోగా ఎదిగాడు. ఈ ప్రయత్నంలోనే ఆయన కథాకథనాలపై మంచి పట్టు సాధించాడు. తన సినిమా కథ ఎలా ఉండాలి? తన బాడీ లాంగ్వేజ్ కి ఎలాంటి కథ సరిపోతుంది? అనే విషయంలో ఆయనకి పూర్తి క్లారిటీ ఉంది.

ఆయన ఖాతాలో 'క్షణం'.. 'గూఢచారి'.. 'ఎవరు'.. 'మేజర్' వంటి హిట్స్ ఉన్నాయి. అడివి శేష్ కథల ఎంపిక ఎంత విభిన్నంగా ఉంటుందనేది ఈ కథల ఎంపిక చెప్పేస్తుంది. విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకుంటూ.. అభిమానుల సంఖ్యను ఎంచుకుంటున్న ఆయన, తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొన్నాడు. రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ .. "మన తెలుగువాడు హిందీలో కూడా సక్సెస్ సాధించాడని 'మేజర్' సినిమాను గురించి చెప్పుకుంటూ ఉంటే సంతోషంగా ఉంది.

నేను ఫారిన్ లో పెరగడం వలన ఇంగ్లిష్ మాట్లాడే స్టైల్ వేరేగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక అందరూ వెక్కిరిస్తున్నారని మార్చుకున్నాను. ఫారిన్ లో ఉన్నప్పటికీ నేను ఎలాంటి వ్యసనాల జోలికి వెళ్లలేదు.

సిగరెట్ .. మందు .. డ్రగ్స్ ను ఇంతవరకూ టచ్ చేయలేదు. ఇది వద్దు అని నేను అనుకుంటే ఇక అటువైపు ఎలాంటి పరిస్థితుల్లోను వెళ్లను. ఇక ఏదైనా అలవాటైందంటే దానిని వదిలించుకోవడం సాధ్యం కాదు. నేను ఏదైనా విషయంపై ఫోకస్ పెడితే అలా ఉంటుంది. అందువలన వ్యసనాలకు దాదాపు దూరంగానే ఉంటాను.

ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదేం .. లవ్ ఫెయిల్యూర్ లాంటి స్టోరీ ఏదైనా ఉందా? అని అడుగుతున్నారు. నిజంగానే అలాంటి స్టోరీ ఉంది. యూఎస్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. నా పుట్టిన రోజునాడే తన పెళ్లి అయింది. ఆ ఎఫెక్ట్ నాపై బాగా పడింది.

లవ్ లో దెబ్బ తినడం వలన పెళ్లి పై పెద్దగా దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. ఇంట్లో వాళ్లు ఆల్రెడీ సంబంధాలు చూడటం మొదలుపెట్టారు" అంటూ చెప్పుకొచ్చాడు. 'ఇండస్ట్రీలో ఇంతకాలంగా ఎదగనీయలేదనే బాధ .. ఆవేదన మీలో బలంగా ఉన్నాయనుకుంటా? అనే ప్రశ్నకు శేష్ ఏమని సమాధానం చెప్పాడనేది రేపు ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.