Begin typing your search above and press return to search.

'మేజర్'పై నమ్మకం ఉందన్న అడివి శేష్

By:  Tupaki Desk   |   17 Dec 2020 2:30 AM GMT
మేజర్పై నమ్మకం ఉందన్న అడివి శేష్
X
అడివి శేష్ .. ఓ ప్రత్యేకమైన నటుడు. విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. శేష్ ఏ పాత్ర పోషించినా తెరపై ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తెరపై శేష్ కనిపించడు .. అలా కనిపించడానికి ఆయన ఇష్టపడడు. కథలో కొత్తదనం .. కథనంలో వైవిధ్యం ఉన్నప్పుడే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. లేదంటే స్క్రిప్ట్ సంతృప్తికరంగా వచ్చేవరకూ కసరత్తు చేస్తూనే ఉంటాడు. శేష్ కి కథ .. స్క్రీన్ ప్లే పై మంచి పట్టు ఉంది. అందువలన స్క్రిప్ట్ దశ నుంచి ఆయన ప్రమేయం ఉంటుంది. అందువలన పాత్రలోకి ఆయన పూర్తిగా పరకాయ ప్రవేశం చేయడం తెరపై కనిపిస్తూ ఉంటుంది.

అడివి శేష్ కి ఒక్క పూటలో సక్సెస్ దక్కలేదు .. ఒక్క రోజులో ఇంతటి గుర్తింపు రాలేదు. 2002లో నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన, చిన్నచిన్న పాత్రలు చేస్తూ వస్తున్నాడు. అదృష్టం కొద్దీ అప్పుడప్పుడు కొన్ని మంచి పాత్రలు పడి అతని ఉనికిని చాటిచెప్పాయి. పట్టుదలతో ఆయన వేసిన అడుగులు ఫలించి హీరో అయ్యాడు. హీరోగా ఆయన చేసిన 'క్షణం' మంచి బ్రేక్ ఇచ్చింది. ఆయనలో ఓ బలమైన నటుడు ఉన్నాడనే విషయాన్ని ఈ సినిమా స్పష్టం చేసింది. ఆ తరువాత వచ్చిన 'గూఢచారి' అనూహ్యమైన విజయాన్ని సాధించింది. హీరోగా ఈ సినిమా శేష్ ను మరోమెట్టు పైకి ఎక్కించింది.

ఇక క్రితం ఏడాది వచ్చిన 'ఎవరు?' సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే అద్భుతం. శేష్ తన పాత్రలో చాలా డీసెంట్ గా నటించాడు. తన పాత్రని సహజత్వానికి దగ్గరగా తీసుకెళుతూ మంచి మార్కులు కొట్టేశాడు. శేష్ సినిమాలు ప్ర్రత్యేకం అనే టాక్ ను ఈ సినిమా సక్సెస్ మరింత బలపరిచింది. ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన 'మేజర్' సినిమా చేస్తున్నాడు. ఎంతో అంకితభావంతో శ్రమిస్తున్నాడు. ఈ సినిమాకి మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడంటే కథలో మంచి దమ్ము ఉంటుందనే విషయం అర్థమవుతూనే ఉంది. తాజా ఇంటర్వ్యూలో 'మేజర్' సినిమాను గురించి శేష్ ప్రస్తావించాడు.

'మేజర్' సినిమా .. 'మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్' జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇంకా 40 శాతం వరకూ చిత్రీకరణ జరుపుకోవలసి ఉంది. మొదటి నుంచి కూడా దేశభక్తి అనేది మనం చేసే హడావిడిలో కాదు .. మన ఆలోచనల్లో .. ఆచరణలో ఉండాలనేది నా ఉద్దేశం. ఈ సినిమా చేయాలని నేను అనుకున్నప్పటి నుంచి, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి జీవితాన్ని గురించిన విశేషాలను మరింత విపులంగా తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ పాత్రను చేస్తూ వెళుతున్నాను. నా ప్రయత్నం ఫలిస్తుందనే ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.