Begin typing your search above and press return to search.

రణవీర్ సింగ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ని ఆదిత్య కపూర్ లైన్లో పెట్టాడా..?

By:  Tupaki Desk   |   28 Oct 2020 4:30 PM GMT
రణవీర్ సింగ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ని ఆదిత్య కపూర్ లైన్లో పెట్టాడా..?
X
మూడేళ్ళ క్రితం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ కాలేజీలో చదువుతున్న రోజుల్లో తన గర్ల్ ఫ్రెండ్ ని ఆదిత్య రాయ్ కపూర్ తనవైపుకు తిప్పుకున్నాడని కామెంట్ చేసాడు. 2017లో నటి నేహా ధుపియా రేడియో చాట్‌ షో సీజన్‌ 2లో మాట్లాడిన రణవీర్ సింగ్ ''జూనియర్‌ కాలేజీలో ఆదిత్యా రాయ్‌ కపూర్‌ ని అమ్మాయిలు బాగా ఇష్టపడేవారు. అతను ప్రతి అమ్మాయికి కలల రాకుమారుడు. నేను అప్పట్లో ఓ అమ్మాయిని ఘాడంగా ప్రేమించాను. ఇప్పుడు తనకు పెళ్లైపోయింది.. ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. మేమిద్దరం జీవితం గురించి ఎన్నో కలలు కన్నాం. మా ప్రేమ నాలుగైదేళ్లు సంతోషంగా సాగింది. నేను ఆమె ప్రేమలో పిచ్చిగా మునిగిపోయాను. చివరికి నాకు బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆదిత్య రాయ్‌ కపూర్‌ కు దగ్గరైంది'' అని చెప్పుకొచ్చాడు. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత రణవీర్ సింగ్ వ్యాఖ్యలపై ఆదిత్య కపూర్ స్పందించారు.

తాజాగా ఆదిత్య కపూర్‌ ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ రణవీర్ ఎక్కువగా ఊహించుకుని మాట్లాడారని.. ఆ అమ్మాయి అతనితో విడిపోయిన 8 నెలల తర్వాత తనను కలిసిందని వెల్లడించాడు. ''రణవీర్ ఎలా ఫీల్‌ అయ్యాడో ఏం అనుకున్నాడో నాకు తెలియదు. కానీ వాళ్లిద్దరు విడిపోయిన ఎనిమిది నెలల తర్వాత నేను ఆ అమ్మాయిని చూశా'' అని ఆదిత్య వివరించాడు. కాగా, 'ఆషిఖీ' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య రాయ్ కపూర్.. ఇటీవలే 'సడక్‌ 2' చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేశాడు. మరోవైపు రణవీర్ సింగ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అలానే హీరోయిన్ దీపికా పడుకునే ని ప్రేమించి 2018 నవంబరు 14న ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీపికా - రణవీర్ కలిసి 'రామ్‌ లీలా' 'బాజీరావ్ మస్తానీ' 'పద్మావత్' వంటి చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన కపిల్ దేవ్ బయోపిక్ ''83'' విడుదలకు సిద్ధంగా ఉంది.