Begin typing your search above and press return to search.

'అధీర' సాంగ్: డిఫరెంట్ గెటప్స్ తో ఆకట్టుకున్న చియాన్..

By:  Tupaki Desk   |   22 April 2022 10:30 AM GMT
అధీర సాంగ్: డిఫరెంట్ గెటప్స్ తో ఆకట్టుకున్న చియాన్..
X
సినిమా కోసం, అందులోని పాత్ర కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉండే హీరోలలో చియాన్ విక్రమ్ ఒకరు. విలక్షణ నటుడు కెరీర్ ఆరంభం నుంచీ వైవిధ్యమైన చిత్రాల్లో.. విలక్షణమైన పాత్రల్లో.. విభిన్న గెటప్ లలో కనిపిస్తూ వస్తున్నాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే విక్రమ్.. ఇప్పుడు ''కోబ్రా'' అనే మరో కొత్త తరహా చిత్రంతో రాబోతున్నాడు.

'కోబ్రా' సినిమాకి ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ఫస్ట్ సింగిల్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'అధీరా' అనే మరో సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ పాట విజువల్ ట్రీట్ ను అందించిందని చెప్పాలి.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ నుంచి వచ్చిన 'అధీర' పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో కథానాయకుడి పాత్ర తీరుతెన్నులు.. అతని ప్రయాణాన్ని స్పష్టంగా చూపించారు. విజువల్స్ 'కోబ్రా' వరల్డ్ లోకి తీసుకెళ్తున్నాయి. విక్రమ్ ఒకదానికొకటి భిన్నంగా ఉండే పలు గెటప్స్ లో కనిపిస్తున్నాడు.

''కోబ్రా'' అనేది క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇందులో విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కేఎస్ రవికుమార్ - మియా జార్జ్ - మృణాలిని - కనికా - పద్మప్రియ - బాబు ఆంటోనీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. 'మహాన్' సినిమాతో మళ్లీ ఫార్మ్ లోకి వచ్చిన విక్రమ్.. ''కోబ్రా'' చిత్రంతో ఎలాంటి సక్సెస్ సాధిస్తారో చూడాలి.