Begin typing your search above and press return to search.

ఇప్పటితో పోల్చుకుంటే 'అడవిరాముడు' వసూళ్లు 700 కోట్లు!

By:  Tupaki Desk   |   3 May 2022 1:30 AM GMT
ఇప్పటితో పోల్చుకుంటే అడవిరాముడు వసూళ్లు 700 కోట్లు!
X
సీనియర్ దర్శక నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజాకి మంచి పేరు ఉంది. ఇండస్ట్రీలోని విషయాల పట్ల ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెబుతుంటారు. ఈ మధ్య కాలంలో భారీ సినిమాలు రాబడుతున్న వసూళ్లు .. కొత్త రికార్డులు సృష్టించాయంటూ చూపిస్తున్న నెంబర్లపై ఆయన స్పందించారు. తెలుగు సినిమా ఇప్పుడు తన వైభవాన్ని చాటుకుంటోంది .. అందరూ గర్వించదగిన స్థాయిని అందుకుందంటూ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

'టైమ్స్ ఆఫ్ ఇండియా' సర్వేలో భారతదేశం మొత్తంలో 'మాయా బజార్' సినిమా మొదటిస్థానంలో నిలబడింది. ఆ రోజుల్లో 'పాతాళ భైరవి' .. ' సువర్ణ సుందరి' సినిమాలు సిల్వర్ జూబ్లీ అనిపించుకున్నాయి. జెమినీ వాసన్ గారు తీసిన 'చంద్రలేఖ' సినిమాను గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.

ఇప్పుడు కొత్తగా చేసిందేమీ లేదు. తెలుగువాళ్లు ఇంతకుముందే ఎన్నో చేశారు. నార్త్ ఇండియాకి పేరు తీసుకొచ్చిందే మనం. అక్కడి దర్శకులు మన కథల చుట్టూ తిరగడంలో ఆశ్చర్యం ఏవుంది? తెలుగు సినిమాకి బయటవాళ్లెవరో పేరు తెచ్చారనడంలో నిజం లేదు.

తెలుగు సినిమా ప్రయాణం విషయంలో పాతవాళ్లనీ గౌరవిద్దాం .. కొత్తవాళ్లని గౌరవిద్దాం. తెలుగు సినిమా రికార్డులను నెంబర్స్ ను బట్టి నిర్ణయించవద్దు. నెంబర్స్ అనేవి సినిమా టిక్కెట్ల రేట్లను బట్టి కనిపిస్తాయి. అప్పట్లో ఉన్న టికెట్ల రేటును బట్టి ఆ వసూళ్లు కనిపిస్తాయి. నిన్న ఎవరో అంటున్నారు ... ' అడవిరాముడు' సినిమా వసూళ్లను ఈ రోజు వసూళ్లతో పోల్చుకుంటే 700 కోట్లు రాబట్టినట్టు అవుతుందట. అలా చూసుకుంటే ' లవ కుశ' . 'మూగమనసులు' సినిమాలు రాబట్టిన వసూళ్లు 2 వేల కోట్లో .. 3 వేల కోట్లో అవుతుంది.

ఆ రోజుల్లో విఠలాచార్యగారు 'జగన్మోహిని' సినిమాను చాలా తక్కువ బడ్జెట్లో తీశారు .. ఆ సినిమా ఏ స్థాయిలో వసూళ్లు రాబట్టిందన్నది చెప్పడం కష్టమే. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమా అలా ఆడుతూనే ఉండేది. సుకుమార్ .. రాజమౌళి .. ప్రశాంత్ నీల్ చాలా అద్భుతంగా సినిమాలు తీశారు.

విపరీతమైన వసూళ్లను రాబట్టినందుకు వాళ్లను అభినందించవలసిందే. కాకపోతే మనం చరిత్రను మరిచిపోకూడదు. హిందీవాళ్లను డామినేట్ చేశాము అంటూ ప్రాంతీయతత్వం తీసుకుని రాకూడదు. మనం బాగుండాలి .. మనతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం అన్ని విధాలా మంచిది" అని చెప్పుకొచ్చారు