Begin typing your search above and press return to search.

క‌థానాయిక‌లు ఇలాంటి చెత్త ఛాలెంజ్ లు ఆపాలి!

By:  Tupaki Desk   |   29 July 2020 9:30 AM IST
క‌థానాయిక‌లు ఇలాంటి చెత్త ఛాలెంజ్ లు ఆపాలి!
X
స్త్రీవాదం.. మ‌హిళా సాధికారిత‌.. అన్నివేళ‌లా హాట్ టాపిక్. సోషల్ మీడియా డిజిట‌ల్ యుగంలో ఇలాంటివ‌న్నీ భిన్న‌మైన రూపాల్ని తీసుకుంటున్నాయి. మీటూ హ్యాష్ ట్యాగ్ వంటివి మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల ప్ర‌హ‌స‌నాన్ని ఎదుర్కొనేందుకు బ‌ల‌మైన ఆయుధంగా ఉప‌యోగ‌ప‌డింది. మీటూ వార్ త‌ర్వాత పురుష‌పుంగ‌వుల్లో కొంత‌వ‌ర‌కూ మార్పు క‌నిపించింది. త‌మ‌కు జ‌రిగే అన్యాయాల్ని ప్ర‌శ్నించేందుకు హ్యాష్ ట్యాగ్ ఉద్య‌మాలు స‌హ‌క‌రిస్తున్నాయి.

అయితే స‌రిగ్గా ఇది మ‌రిన్ని సృజ‌నాత్మ‌క ప్ర‌క్రియ‌ల‌కు దారి తీస్తోందా? స‌్త్రీవాదాన్ని బ‌ల‌ప‌రిచేందుకు మ‌హిళ‌లంతా సామాజిక మాధ్య‌మాల్లో స‌రికొత్త ట్రెండ్ ల‌ను సైలెంటుగా క్రియేట్ చేస్తున్నారా? అంటే అవున‌నేందుకు ఆధారాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇది సెల‌బ్రిటీల్లో ఒక ఆట‌లాగా విస్త‌రిస్తోంద‌న్న వాద‌న‌కు బ‌లం చేకూరుతోంది.

బ్లాక్ అండ్ వైట్ (నలుపు మరియు తెలుపు) సెల్ఫీ కాన్సెప్ట్ దీనిని ధృవ‌ప‌రుస్తోంది. కొంద‌రు నటీమణులతో క‌లిసి సంఘంలో సెల‌బ్రిటీ హోదాలో ఉన్న చాలా మంది ఆడ‌వారు.. ఇతర రంగాల్లోని ప్రముఖ మహిళలు కూడా ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నార‌న‌డానికి సామాజిక మాధ్య‌మాల్లో బ‌య‌ట‌ప‌డుతున్న బ్లాక్ అండ్ వైట్ సెల్ఫీలే ఆధారం. గత కొన్ని రోజులుగా ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో ఈ ధోరణి వైర‌ల్ గా మారింది. ‘ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్’ ఛాలెంజ్ ని స్వీక‌రించేందుకు ఎక్కువ‌మంది ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. ఇది ఎక్క‌డ మొద‌లైంది? అన్న‌ది అటుంచితే.. ఇంతగా వైర‌ల్ అవుతోందేమిటి? అన్న‌దే సందిగ్ధం.

ఇద్ద‌రు ఆడ‌వాళ్ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది! అని భావించే వారికి ఇదో సిస‌లైన ఛాలెంజ్ గా మారింది. ఇత‌ర‌ మహిళల కోసం నిలబడటానికి ఒకరినొకరు పైకి లేపడానికి ఇది ఒక మార్గ‌మా? ఛాలెంజ్ కి నామినేట్ చేయ‌డం దానిని ఇత‌ర మ‌హిళ‌లు స్వీక‌రించ‌డం ఇదంతా ఒక ఆట‌లాగా మారిందా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. ఎక్కువ మంది స్నేహితుల‌కు సవాలును ఇవ్వడం స్త్రీ సాధికారతను ప్రోత్సహించడ‌మ‌నే అనుకోవాలా? అంటే సోష‌ల్ మీడియాల్లో కానేకాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదంతా టైమ్ పాస్ ఆట‌. దానికంటే మేలైన ప‌నులు ఎన్నో చేయొచ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆడ‌వాళ్ల‌లో క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారీ వ్యాప్తిని నిరోధించేందుకు లేదా ఇంకేదైనా పాజిటివిటీని పెంచే ప‌ని చేస్తే బావుండేది. మహిళలకు సాధికారత పెంచే పుస్తకాలు.. వ్యాసాలు షేర్ చేసుకుంటే మంచి జ‌రుగుతుంది. స్వచ్ఛంద సంస్థలతో కార్య‌క‌లాపాల్ని విస్త‌రించుకుంటే అది అంద‌రికీ మేలునిచ్చేదిగా ఉంటుంది అంటూ నెటిజ‌నం సూచిస్తున్నారు. సంఘాన్ని ప్ర‌భావితం చేసే నాయిక‌లు సెల‌బ్రిటీలు ఈ త‌ర‌హా ఆలోచ‌న‌లు చేస్తేనే బావుంటుంద‌నేది నెటిజ‌నుల సూచ‌న‌. సెల్ఫీ ధోర‌ణుల‌తో సాధించేదేమీ లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. తెలుపు న‌లుపు ఆట ఇక ఆపితేనే మేలు అనే వారు ఎక్కువ‌య్యారు.