Begin typing your search above and press return to search.

ఆ మూవీ అర్థం కావాలంటే మైండ్ పెట్టాల్సిందేనట

By:  Tupaki Desk   |   15 Aug 2021 5:30 AM GMT
ఆ మూవీ అర్థం కావాలంటే మైండ్ పెట్టాల్సిందేనట
X
సినిమా ఒక వినోదం. తెలుగు ప్రజలు దేనినైనా సింఫుల్ గా అర్థమయ్యే వాటికి ఇట్టే కనెక్టు అయిపోతారు. నువ్వు కామెడీగా చెప్పు లేదంటే సీరియస్ గా చెప్పినా ఓకే. విషయాన్ని సూటిగా చెప్పేస్తే చాలు. ఆ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా కంగాళీ తప్పదు. మిగిలిన విషయాల్లోనే ఇలా ఉంటే.. సినిమా విషయంలో మరెంతలా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. నేను తీస్తున్నది అద్భుతమైన సినిమా అని చెబితే చాలు.. ఆ టీంకు చుక్కలే. ఎందుకంటే.. అద్భుతాన్ని అద్భుత స్థాయిలో చూడాలని తెలుగు ప్రేక్షకుడు ఫిక్స్ అయిన ప్రతిసారి ఆ సినిమా పరిస్థితి ఎంతలా మారిందో తెలిసిందే.

అంతేకాదు.. ఏదైనా సినిమా మీద అంచనాలు పెంచుకోవటం మొదలు పెట్టి.. అది తాము అనుకున్నట్లుగా లేకపోతే.. అడ్డంగా తిప్పి కొట్టే విచిత్రమైన లక్షణం తెలుగుప్రేక్షకుల్లో చాలా ఎక్కువ. అంతేకాదు.. లాజిక్ అదరాలే కానీ.. ఆ లాజిక్ ను అర్థం చేసుకోవటానికి బుర్రకు పదునుపెట్టాలి.. సుడోకు పూర్తి చేసినంత సీరియస్ గా సినిమా చూడాలంటే తెలుగు ప్రేక్షకుడికి మహా సిరాకు. ఈ విషయం ఇప్పటికే కొన్ని సినిమాలు ఫ్రూవ్ చేశాయి.

ఇలాంటివేళ.. తమ సినిమా అర్థం కావాలంటే కాస్త మైండ్ పెట్టాలని చెబితే.. అంతకు మించిన బూతు ఇంకేం ఉంటుంది? డబ్బులు పెట్టి చూసే సినిమాను అర్థం చేసుకోవాలంటే మైండ్ పెట్టి చూడాలన్న మాట వింటుంటే తేడా కొడుతోంది. ఇంతకీ ఏ సినిమా గురించి ఇదంతా అంటారా? అక్కడికే వస్తున్నాం. ఈ వారం ‘రాజ రాజ చోర’ మూవీ విడుదలవుతోంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు హీరోగా చేస్తుంటే.. హీరోయిన్ గా సునయన చేస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి సనయన మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా అర్థం కావాలంటే మైండ్ పెట్టాలన్న మాట చెప్పేసింది.

ఆమె చెప్పిన ఈ మాట తేడా కొట్టేసేలా ఉందని చెప్పాలి. తెలుగు ప్రేక్షకుడికి సినిమా అంటే ఇలా చూస్తే అలా అర్థం కావాలి. కావాలంటే వెకిలి జోకులతో ఉక్కిరిబిక్కిరి చేయాలి.. దానికి అద్భుతమైన హాస్యమన్న పేరు పెట్టినా ఫర్లేదు. లేదంటే అద్భుతమైన భావోద్వేగం ఉండాలి. కట్టిపడేసే విజువల్స్ ఉన్నా ఓకే. ఇదంతా కానుకుంటే.. విన్నంతనే మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు ఉండి.. కథ పెద్దగా లేకున్నా ఓకే. అంతేకానీ..మైండ్ పెడితే కానీ అర్థం కానంత గొప్ప సినిమా అంటే కష్టమే? ఈ విషయాన్ని సదరు దర్శకుడు ఎలా మిస్ అయినట్లు?