Begin typing your search above and press return to search.

ఓపెన్ గా చెప్పే దమ్ము ఎంతమందికుంది?

By:  Tupaki Desk   |   26 Sept 2016 12:49 PM IST
ఓపెన్ గా చెప్పే దమ్ము ఎంతమందికుంది?
X
సినిమా పరిశ్రమలో సూటిగా.. స్పష్టంగా మాటలు చెప్పే వారు చాలా తక్కువగా కనిపిస్తారు. ఇక.. హీరోయిన్ల వ్యవహారానికే వస్తే.. కర్ర విరగకుండా.. పాము చావకూడదన్న చందంగా మారి మాటలు ఉంటాయి. నచ్చిన హీరో ఎవరంటే.. ఒక్క ముక్కలో చెప్పేందుకు అస్సలు ఇష్టపడరు. డ్యాన్సుల్లో ఫలానా అని.. యాక్టింగ్ లో ఇంకొకరు.. ఎనర్జీలో మరొకరు ఇలా చాలానే మాటలు చెబుతారు. కానీ.. సూటిగా మాత్రం సమాధానం చెప్పరు.

కానీ.. అలాంటి మాటలకు మినహాయింపు నాటి క్యూట్ లుక్స్ హీరోయిన్ స్నేహ. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ ఇష్టపడే స్నేహలో మరో కోణం ఏమిటంటే.. హీరోయిన్ అంటూ హాట్ గా ఉంటుందన్న ముద్రను ఆమె చెరిపేసింది. కూల్ గా ఉంటూనే.. ఇలాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఎంత బాగుండన్నట్లుగా స్నేహ తీరు ఉంటుంది.

2000లో సినిమా రంగంలోకి కాలు పెట్టిన ఆమె పన్నెండేళ్ల తర్వాత తమిళ కథానాయకుడు ప్రసన్నను పెళ్లాడారు. గత ఆగస్టులో పండంటి బిడ్డకు తల్లయ్యారు. పెళ్లి తర్వాత యాక్ట్ చేయటం పెద్దగా ఆసక్తి లేకున్నా.. తనకు తగినట్లుగా ఉండే పాత్రలు వచ్చి.. తప్పనిసరి అయితే ఓకే చెబుతున్న స్నేహ ఆంటీ ఈ మధ్యన ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా రకరకాల క్వశ్చన్స్ తో పాటు.. ఇప్పుడున్న జనరేషన్ లో మీకు నచ్చిన హీరో ఎవరని అడిగారు. దీనికి ఆమె ఎలాంటి మొహమాటానికి పోకుండా తన నచ్చిన వారి పేరును చెప్పేసి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడున్న జనరేషన్ లో తనకు నచ్చిన నటుడు విజయ్ సేతుపతి అని.. తానీ మధ్య అతడ్ని కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెప్పేసినట్లు చెప్పారు. ‘‘అతడంటే చాలా ఇష్టం. ఆయన ఎంచుకుంటున్న కథలు.. యాక్షన్.. డైలాగ్ డెలివరీ.. ఎక్కడా మోతాదు మించకుండా ఉండే యాక్షన్ నాకు చాలా ఇష్టం. ఆ విషయాన్ని ఆయనకు చెప్పేశా’’ అంటూ చెప్పేసింది. ఇంత సూటిగా తన ఇష్టాన్ని చెప్పే వారు ఉంటారా..?