Begin typing your search above and press return to search.

నేచుర‌ల్ స్టార్ తో ఢీ అంటే ఢీకి రెడీ అంటోంది ఎవ‌రు?

By:  Tupaki Desk   |   22 July 2022 2:30 PM GMT
నేచుర‌ల్ స్టార్ తో ఢీ అంటే ఢీకి రెడీ అంటోంది ఎవ‌రు?
X
నేచుర‌ల్ స్టార్ నాని రీసెంట్ గా 'అంటే సుంద‌రానికి' అంటూ రొమాంటిక్ ల‌వ్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 10న విడుద‌లై ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. భారీ అంచ‌నాలు పెట్టుకున్న మైత్రీ వారికి, హీరో నానికి తీవ్ర నిరాశ‌ను మిగిల్చింది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత హీరో నాని త‌న పంథాకు పూర్తి భిన్నంగా చేస్తున్న మూవీ 'ద‌స‌రా'. శ్రీ‌కాంత్ ఓదెల ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఎస్‌.ఎల్ వీ సినిమాస్ బ్యాన‌ర్ పై చెరుకూరి సుధాక‌ర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈమూవీ ప‌క్కా తెలంగాణ నేప‌థ్యంలో సాగ‌నుంది. హీరో నాని తొలిసారి తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్ లు ప‌ల‌క‌బోతున్నాడు. ప‌క్కా మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీలో నాని ర‌గ్గ్‌డ్ క్యారెక్ట‌ర్ లో క‌నిపించబోతున్నాడు. కోల్ మైన్స్ నేప‌థ్యంలో పున‌రావాసం కోసం ఫైట్ చేసే ఓ వ‌ర్గం త‌రుపుని నిల‌బ‌డే వ్య‌క్తిగా నాని పాత్ర వుండ‌బోతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

క‌రీంన‌గ‌ర్ స‌మీపంలో వున్న గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి కాల‌రీస్ బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే సింగ‌రేణి కాల‌రీస్ కు సంబంధించిన కాల‌ని సెట్ ని ఏర్పాటు చేసి అందులో ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన ఓ వార్త తాజాగా బయ‌టికి వ‌చ్చింది. ఇందులో హీరోయిన్ పూర్ణ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది.

అయితే త‌న‌ది నెగెటివ్ రోల్ అని, ఈ మూవీలో పూర్తి స్థాయి లేడీ విల‌న్ గా పూర్ణ క‌నిపించ‌బోతోంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే త‌ను 'ద‌స‌రా' షూటింగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది. అయితే పూర్ణ చిన్న సినిమాల‌కు అయితే ఓకే కానీ నాని లాంటి హీరో సినిమాకు విల‌న్ అంటే సెట్ట‌వుతుందా? అన్న‌దే డౌట్‌.

'ద‌స‌రా' బ‌డ్జెట్ కు విల‌న్ గా పూర్ణ స‌రిపోతుందా?.. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌, ర‌మ్య‌కృష్ణ లాంటి వాళ్లు అయితే ఓకే కానీ పూర్ణ విల‌న్ నిజ‌మా? లేక ఆమెది ఓన్లీ నెగెటివ్ క్యారెక్ట‌రా? లేక ఆ ఛాయాలు వున్న చిన్న రోల్ లో క‌నిపించ‌య‌బోతోందా? అని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కానీ ఈ మూవీలో పూర్ణ పాత్ర మాత్రం చాలా క్రుయ‌ల్ గా వుంటుంద‌ని చెబుతున్నారు. ఇదిలా వుంటే ఇందులోని ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో జ‌రీనా వాహెబ్‌, స‌ముద్ర‌ఖ‌ని, సాయి కుమార్‌, త‌దిద‌రులు న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి స‌త్య‌న్ సూర్య‌న్ ఫొటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.