Begin typing your search above and press return to search.

పూతరేకు లాంటి పిల్లను ఎవరూ పట్టించుకోరేం?!

By:  Tupaki Desk   |   9 Sept 2021 5:00 AM IST
పూతరేకు లాంటి పిల్లను ఎవరూ పట్టించుకోరేం?!
X
తెలుగు తెరకి తమ నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలు ఎంతోమంది ఉన్నారు. ఎవరి ప్రత్యేకత వారిది .. ఎవరి ప్రాధాన్యత వారిది. అలా ఈ మధ్యకాలంలో పరిచయమైన నాజూకు భామల పేర్లను పరిశీలిస్తే ఆ జాబితాలో 'ప్రియాంక అరుళ్ మోహన్' పేరు కనిపిస్తుంది. కన్నడ సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ, ఆ తరువాత పెద్ద గ్యాప్ లేకుండానే తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాతో .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో ఆమె కథానాయికనే ... అయితే కథ మొదలయ్యే సమయానికే ఆమెకి వేరొకరితో ఎంగేజ్ మెంట్ అయినట్టుగా చూపించడం వలన, హీరోతో ఆమెకి ఎలాంటి పాటలు లేకుండా పోయాయి. అయినా ఆడియన్స్ కి ఆ లోటు తెలియదు. అందుకు కారణం ప్రియాంక చక్కదనం. అక్వేరియంలో అప్పుడే వదిలిన చేప పిల్లల్లా తళుక్కు .. తళుక్కు మంటూ మెరిసే ఆమె కళ్లను చూస్తూ, కుర్రాళ్లు రెప్పలు కొట్టడం మరిచిపోయారు. పూలతోటలో జారిపడిన పున్నమి జాబిల్లిలాంటి ఈ పిల్లను చూసి, ఇంతకుమించిన అందం ఇలలో లేదు అనేసి ఫిక్స్ అయ్యారు.

తెలుగు తెరకి ఈ పిల్ల తేనెవాగులో దొరికినట్టుగా ఉండటం వలన, ఈ అమ్మాయిని అడ్డుకోవడం ఎవరివలన కాదనే అభిప్రాయానికి వచ్చేశారు. యంగ్ స్టార్ హీరోలంతా ఈ పిల్ల కోసం పోటీపడటం ఖాయమని అనుకున్నారు. ఆ తరువాత వచ్చిన 'శ్రీకారం'లో .. 'భలేగుంది బాలా .. ' పాటలో అమ్మాయి అందమైన అలకలు చూసి, ఆరు పలకల అబ్బాయిలు కూడా ఫ్లాట్ అయ్యారు. మనసులన్నీ మూటగట్టి మల్లెమొగ్గవంటి ఈ సుందరి కళ్ల వాకిళ్లలో పడేశారు. వంటిమీద వయసున్నంతవరకూ తమ మనసులో ఆమెనే ఉండాలని కోరుకున్నారు.

కాస్త పలచబడ్డ చందమామలా కనిపించే ఈ అమ్మాయి జోరు తెలుగులో అంతగా కనిపించడం లేదు. తమిళంలో సూర్య ... శివ కార్తికేయ సరసన సినిమాలు చేస్తోంది. తెలుగులో చేయలేనంత బిజీగా ఏమీ లేదుగానీ, ఇక్కడి నుంచి అవకాశాలు వెళ్లడం లేదని తెలుస్తోంది. సక్సెస్ లేకపోవచ్చునేమోగానీ .. పిల్ల గ్లామర్ కి గ్రాము మందం కూడా వంకబెట్టలేం. తమలపాకులు .. తామరరేకులు తల వంచుకునే నాజూకుదనం ఈ అమ్మాయి సొంతం. యూత్ గుండెల్లో ఈ అమ్మాయి కట్టిన గూళ్లు .. ఊళ్లు చూసైనా, దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారేమో చూడాలి.