Begin typing your search above and press return to search.

కార్తి సినిమాతో క్రేజీ హీరోయిన్ రీ ఎంట్రీ

By:  Tupaki Desk   |   29 March 2022 1:30 AM GMT
కార్తి సినిమాతో క్రేజీ హీరోయిన్ రీ ఎంట్రీ
X
జేడీ చ‌క్ర‌వ‌ర్తి, శ్రీ‌కాంత్ హీరోలుగా న‌టించిన `ఎగిరే పావురామా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది లైలా. ఎస్వీ కృష్ణారెడ్డి తెర‌కెక్కించిన ఈ మూవీ అనూహ్య విజ‌యాన్ని సాధించి తెలుగులో హీరోయిన్ గా లైలాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. షారుక్ ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్ క‌లిసి న‌టించిన `దుష్మ‌న్ దునియాకా` సినిమాతో కెరీర్ ప్రారంభించిన లైలా ద‌క్షిణాదిలో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది మాత్రం `ఎగిరే పావురామా` చిత్రంతో నే. ఆ త‌రువాత తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ చిత్రాల్లో న‌టిస్తూ వ‌చ్చింది.

2006లో వ‌చ్చిన త‌మిళ చిత్రం `తిరుప‌తి` త‌రువాత న‌ట‌న‌కు గుడ్ బై చెప్పేసింది. అజిత్ హీరోగా న‌టించిన ఈ మూవీ త‌రువాత బాంబేకి వెళ్లిపోయిన లైలా ఇరానీ బిజినెస్ మెన్ మెహెదినీ వివాహం చేసుకుంది. అప్ప‌టి నుంచి సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తోంది. 2019లో ఓ త‌మిళ డాన్స్ షోకు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన లైలా మ‌ళ్లీ ఇన్నేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టింది. హీరో కార్తి న‌టిస్తున్న `స‌ర్దార్‌` సినిమాతో త‌న సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తోంది.

పీ.ఎస్ . మిత్ర‌న్ డైరెక్ట్ చేస్తున్న ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీలో లైలా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఇందులో కార్తీ ద్వి పాత్రాభిన‌యం చేస్తున్నారు. ఓ పాత్ర‌లో తండ్రిగానూ సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో .. మ‌రో పాత్ర‌లో త‌న‌యుడిగా యంగ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. యంగ్ పాత్ర‌కు జోడీగా రాశిఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, తండ్రి పాత్ర‌కు జోడీగా లైలా న‌టిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. గ‌తంలో కార్తి సోద‌రుడు సూర్య తో క‌లిసి నందా, మౌనం పేసియ‌దే, పితామ‌గ‌న్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించింది.

మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత సూర్య సోద‌రుడు కార్తి సినిమాతో కోలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. 2019లోనే ఓ మూవీతో త‌న సెకండ్ ఇన్నింగ్స్‌ని లైలా ప్రారంభించాల‌ని ప్లాన్ చేసింద‌ట‌. అయితే ఆ మూవీ ప్రారంభం కాకుండా నే ఆగిపోవ‌డంతో ఇప్ప‌డు కార్తీ సినిమాలో ప‌రిచ‌యం అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న `స‌ర్దార్‌` తెలుగులోనూ ఇదే పేరుతో విడుద‌ల కానుంది.