Begin typing your search above and press return to search.

నటి ఆరోపణలను ఖండించిన దర్శకనిర్మాత..!

By:  Tupaki Desk   |   24 Oct 2020 9:30 PM IST
నటి ఆరోపణలను ఖండించిన దర్శకనిర్మాత..!
X
బాలీవుడ్‌ దర్శకనిర్మాత మహేష్ భట్‌ తనను వేధింపులకు గురి చేసినట్లు నటి లువియానా లోధ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మహేష్ భట్‌ దగ్గరి బంధువైన సుమిత్‌ సబర్వాల్‌ ను వివాహం చేసుకున్న లువియానా లోధ్.. ఇటీవల విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే మహేష్ భట్‌ నుంచి తనకి ప్రమాదం ఉందని పలు ఆరోపణలు చేస్తూ ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో లువియానా ఆరోపణలను ఖండిస్తూ.. తన క్లయింట్ త్వరలోనే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మహేష్‌ భట్‌ తరపు న్యాయవాది ఓ ప్రకటన విడుదల చేశారు. ''లువియానా లోధ్‌ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి మాత్రమే కాదు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయి. ఆమె విడుదల చేసిన వీడియో వలన చట్ట పరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోనుంది. ఈ ఆరోపణలను మా క్లైయింట్‌ మహేష్‌ భట్‌ తీవ్రం గా ఖండిస్తున్నారు. త్వర లోనే ఆమె పై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు'' అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, మహేష్‌ భట్‌ మరియు ఆయన కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్‌ లో లువియానా లోధ్ 1 నిమిషం 48 సెకన్‌ ల నిడివి గల ఓ వీడియో పోస్టు చేసింది. లువియానా లోధ్ మాట్లాడుతూ ''మహేష్ భట్‌ బంధువు సుమిత్‌ సబర్వాల్‌ ను కొంత కాలం క్రితం పెళ్లి చేసుకున్నాను. కొంతమంది హీరోయిన్ల కు సుమిత్‌ డ్రగ్స్ సరఫరా చేస్తాడనే విషయం తెలియడం తో ఇటీవల విడాకుల కోసం కోర్టు కు వెళ్ళాను. ఈ విషయాలన్నీ మహేశ్‌ భట్‌ కి కూడా తెలుసు. ఇండస్ట్రీకి ఆయన ఒక పెద్ద డాన్‌. పరిశ్రమకు చెందిన ప్రతిదీ ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ ఆయన చెప్పినట్లు వినక పోతే.. ఎదుటివారి జీవితాలను కష్టాల్లోకి పడేస్తాడు. అలా చాలా మందికి పని లేకుండా చేసి వారి జీవితాలను నాశనం చేశాడు. ఆయన ఒక్క ఫోన్‌ చేస్తే చాలు ఉద్యోగాలు కోల్పోతారు. ఇంటి నుంచి నన్ను బయటకు వెళ్లగొట్టాలని చూశాడని ఆయనపై గతం లో వేధింపుల కేసు పెట్టాను. కానీ పోలీసులు పట్టించుకో లేదు. నాతో పాటు నా ఫ్యామిలీ భద్రత కోసమే ఈ వీడియో పోస్ట్‌ చేస్తున్నాను. ఒకవేళ నా ఫ్యామిలీ కి నాకు ఏదైనా జరగరానిది జరిగితే దానికి కారణం మహేష్ భట్ - ముఖేష్‌ భట్‌ - సుమిత్‌ సబర్వాల్‌ - సాహెల్‌ సెహగల్‌ - కుంకుమ్‌ సెహగల్‌'' అని పేర్కొన్నారు.