Begin typing your search above and press return to search.

హీరోయిన్ భావన కిడ్నాప్.. అంతలా చేశారట

By:  Tupaki Desk   |   18 Feb 2017 6:16 AM GMT
హీరోయిన్ భావన కిడ్నాప్.. అంతలా చేశారట
X
దక్షిణాది సినీ రంగానికి చెందిన హీరోయిన్ భావన పట్ల కొందరు దుండగులు దారుణంగా వ్యవహరించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలుగు.. తమిళం.. కన్నడ.. మలయాళ భాషల్లో మొత్తం 70 చిత్రాల్లో నటించిన ఆమెకు ఘోర అనుభవం ఎదురైంది. తెలుగులోని ఒంటరి.. మహాత్మా.. నిప్పు చిత్రాల్లో నటించిన ఆమె.. కిడ్నాప్ కు గురైంది. ఈ ఘటనకు సంబంధించి రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకటి ఆమెను కిడ్నాప్ చేసి.. లైంగికంగా వేధించినట్లుగా ఒక వెర్షన్ కాగా.. రెండో వెర్షన్ లో కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసి.. ఆపై ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది.

కేరళలోని కోచి దగ్గర చోటు చేసుకున్న ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. కేరళలోని త్రిస్సూర్ నుంచి కోచికి హీరోయిన్ భావన కారులో బయలుదేరింది. ఆమె కారును కొందరు గుర్తు తెలియని దుండగులు ఫాలో అయ్యారు. కోచిలోని నెడుంబస్సెరీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్దకు రాగానే భావన ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టారు. అనంతరం భావన కారు డ్రైవర్ మార్టిన్ ను బయటకు లాగి కారులో కూర్చున్న వారు.. గంటన్నర పాటు సిటీ మొత్తం తిప్పారు. ఆ సమయంలో ఆమె పట్ల దుండగులు అనుచితంగా ప్రవర్తించి.. లైంగిక వేధింపులకు గురి చేశారు. కొన్ని ఫోటోలు.. వీడియోలు తీసుకొని పారిపోయారు.

అనంతరం భావన కారు డ్రైవ్ చేసుకొని.. దగ్గర్లోని ఒక నిర్మాత ఇంటి వద్దకు వెళ్లిన ఆమె.. జరిగింది ఆయనకు చెప్పారు. దీంతో.. జరిగిన ఉదంతం గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ప్రాధమిక విచారణలో భావన కారు డ్రైవర్ మార్టిన్ తో పాటు.. గతంలో కారుడ్రైవర్ గా పని చేసిన సునీల్ కుమార్ ఆమెను కిడ్నాప్ చేసేందుకు పథకం వేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న కారు డ్రైవర్ సునీల్ నుతీసేయటంతో.. ఇప్పుడున్న కారుడ్రైవర్ తో కలిసి ఈ దారుణానికి ప్లాన్ చేసి ఉంటారని భావిస్తున్నారు.