Begin typing your search above and press return to search.

వాళ్లకి శిక్ష పడాల్సిందేనంటున్న సీనియర్ హీరోయిన్!

By:  Tupaki Desk   |   10 Jan 2022 11:30 AM GMT
వాళ్లకి శిక్ష పడాల్సిందేనంటున్న సీనియర్ హీరోయిన్!
X
భావన .. పేరు వినగానే విశాలమైన కళ్లతో వీలైనన్ని విన్యాసాలు చేసిన అందమైన కథానాయిక రూపం మనసులో మెదులుతుంది. భావన .. కేరళ బ్యూటీ. మలయాళంలో వరుస సినిమాలతో అక్కడి యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్న సమయంలోనే ఆట విడుపు అన్నట్టుగా తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. ఆ జాబితాలో 'ఒంటరి' .. 'హీరో' .. 'మహాత్మ' సినిమాలు ముందువరుసలో కనిపిస్తాయి. ఆ తరువాత ఆమె ఎక్కువగా మలయాళ సినిమాలతో పాటు కన్నడ సినిమాలు చేస్తూ వెళ్లింది.

2017లో భావనను ఒక ముఠా కిడ్నాప్ చేసింది. అప్పట్లో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. భావన ఒక రోజున తన సినిమా షూటింగు ముగించుకుని బయల్దేరింది. కేరళ - ఎర్నాకులం జిల్లాలో హఠాత్తుగా కొందరు దుండగులు ఆమెను అడ్డగించి తమ కారులోకి బలవంతంగా ఎక్కించి తీసుకుని వెళ్లారు. రెండు గంటలపాటు ఆమెను వేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాలీవుడ్ హీరో దిలీప్ పేరు వినిపించింది. అక్కడ ఆయనకి స్టార్ ఇమేజ్ ఉంది. అందువలన ఈ కేసు మరింత ఇంట్రస్టింగ్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా అంతా ఈ విషయాన్ని గురించే మాట్లాడుకున్నారు.

ఆ నాటి ఆ ప్రమాదం గురించి తాజాగా భావన తన ఇన్ స్టాలో ఒక పోస్టును పెట్టింది. "ఇది అంత తేలికైన ప్రయాణం కాదు .. ప్రాణాలతో బయటపడి కొనసాగిస్తున్న ప్రయాణం. నాపై జరిగిన దాడి నా కెరియర్ పై .. నా జీవితంపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ ప్రయాణంలో నన్ను అవమానపరచడానికీ .. ఒంటరిని చేసి ఓడించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అలాంటివాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కుంటూ వస్తున్నాను. ఈ విషయంలో నేను ఇంత నిబ్బరంగా ఉండటానికి కారణం, నా కోసం మాట్లాడే మరికొన్ని గొంతుకలు ఉండటమే.

ఇది నాకు సంబధించిన సమస్య .. నేను మాత్రమే పోరాటం చేయాలి. అందుకు సంబంధించిన శక్తిని నేను సమకూర్చుకోవాలి అని అనుకునే దానిని. కానీ చివరికి న్యాయమే గెలుస్తుందని భావించిన కొందరు నాకు అండగా నిలిచారు. వారి సహాయ సహకారాలను అందించారు. వాళ్లంతా కూడా నా కోసం తమ గొంతు విప్పారు. ఈ పోరాటంలో నేను ఒంటరిని కాదు .. నా కోసం నా వాళ్లంతా ఉన్నారనే ధైర్యం అప్పుడు కలిగింది. ఆ దుండగుల నుంచి మరెవరీకీ ఇలాంటి ప్రమాదం జరక్కుండా ఉండాలంటే వాళ్లకి శిక్ష పడాల్సిందే. అప్పటివరకూ ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాను" అంటూ రాసుకొచ్చింది.