Begin typing your search above and press return to search.

విక్రంకు బ్యాడ్ న్యూ ఇయర్

By:  Tupaki Desk   |   1 Jan 2018 4:32 AM
విక్రంకు బ్యాడ్ న్యూ ఇయర్
X
అందరూ కొత్త సంవత్సర వేడుకల్లో ఆనందంగా సంబరాలు చేసుకుంటూ ఉంటే విలక్షణ నటుడు విక్రం మాత్రం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. కారణం ఆయన తండ్రి వినోద్ రాజ్ నిన్న స్వర్గస్తులు అయ్యారు. నిన్న సాయంత్రం గుండె నొప్పితో ఆయన చివరి శ్వాస విడిచారు. వినోద్ రాజ్ కూడా నటులే కాని ఆయన గురించి సామాన్య ప్రేక్షకులకు తెలిసింది చాలా తక్కువ. తమిళ్ ప్రేక్షకులకు సుపరిచితులే కాని మనకు మాత్రమే ఆయన అపరిచితులే. విక్రంని హీరోగా మలచడంలో ఆయన కృషి చాలా ఉంది. కెరీర్ మొదట్లో సరైన అవకాశాలు లేక చిన్న చిన్న సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ వేస్తున్న విక్రం వెన్ను దట్టి ఏనాటికైనా కమల్ హాసన్ అంతటి పేరు తెచ్చుకునే నటుడివి అవుతావు అని గట్టిగా ప్రోత్సహించేవారట. ఆయన దీవించినట్టుగానే కమల్ తర్వాత ఇండియాలోనే మోస్ట్ కమిటెడ్ అండ్ మల్టీ టాలెంటెడ్ హీరోగా విక్రం పేరు తెచ్చుకున్నారు.

వినోద్ రాజ్ గారి స్వస్థలం పరమకుడి. ఆయన భార్య రాజేశ్వరి సబ్ కలెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈవిడ నటుడు, విలన్ త్యాగరాజన్ చెల్లెలు. జీన్స్ హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్. విక్రం కాకుండా వినోద్ రాజ్ కు మరో అబ్బాయి అరవింద్ ఉన్నారు. అతను సినిమాలకు దూరంగా దుబాయ్ లో సెటిల్ అయ్యాడు. మరో కూతురు అనితా ఇక్కడే టీచర్ గా ఉద్యోగం చేస్తున్నారు. వినోద్ రాజ్ విక్రం హీరో అయ్యాక తాను సినిమాల్లో నటించడం తగ్గించారు . ఆ మధ్య గిల్లి, తిరుపాచ్చి సినిమాల్లో నటించారు కాని ఆరోగ్య రిత్యా తర్వాత మానేసారు. ఈ ఏడాది తన కూతురి పెళ్లి ఘనంగా చేసిన విక్రం ఇయర్ ఎండింగ్ లో ఇలా చేదు ఘటనతో ముగించాల్సి రావడం అభిమానులను కూడా మనస్తాపానికి గురి చేసింది. సినిమా ప్రముఖులు విక్రం తండ్రి మృతికి నివాళి అర్పించారు.