Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పై సుమ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   30 May 2022 1:54 PM GMT
టాలీవుడ్ పై సుమ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు
X
సినీప‌రిశ్ర‌మ‌లో బ‌య్య‌ర్లు పంపిణీ వ‌ర్గాలపైనా.. చిన్న నిర్మాత‌ల ధైన్యం పైనా ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు గ‌ట్టిగా త‌న గొంతు వినిపించేవారు. స్టార్ హీరోలు స్టార్ డైరెక్ట‌ర్ల‌ పారితోషికాలపైనా.. హై బ‌డ్జెట్ల‌పైనా ఆయ‌న ఏనాడూ సంతృప్తిగా లేరు. నేడు దాసరి వర్ధంతి కార్యక్రమంలో హీరో సుమన్ ఇదే త‌ర‌హాలో ప‌రిశ్ర‌మ‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా బయర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పుడు బయ్యర్స్ గురించి ఎవ‌రూ ఆలోచించడం లేదని అన్నారు. సినిమా షూటింగ్ లో సమయ పాలన లేదని.. నిర్మాతకు అదనపు భారం కలిగేలా మేకర్స్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. నేను ఆవేశంగా మాట్లాడుతున్నా గానీ ఇది వాస్తవమని హీరో సుమన్ అన్నారు.

`మా` ఎన్నిక‌లు.. డ్ర‌గ్స్ మ‌త్తుపైనా..!

సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం ఇదే తొలిసారి కాదు. ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. ఇంత‌కుముందు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల వేళ ఆయ‌న హాట్ టాపిక్ అయ్యారు. అప్ప‌ట్లో ఆయ‌న‌ నెల్లూరులో ఓ మీడియా స‌మావేశంలో `మా` ఎన్నిక‌ల‌పై మాట్లాడుతూ.. ఆర్టిస్టుల‌ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం త‌న‌కు ఎంత మాత్రం ఇష్టం లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్న‌ట్లు తెలిపారు. రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం త‌న‌కు ఎంతమాత్రం ఇష్టం ఉండ‌ద‌ని...ఏదైనా ఒకే ప‌నిపై ఏకాగ్ర‌త పెట్టి ప‌నిచేస్తేనే స‌క్సెస్ అవుతామ‌ని అన్నారు. అలాగే టాలీవుడ్ లో ప్ర‌కంప‌న‌లు రేపిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపైనా ఆయ‌న స్పందించారు. డ్ర‌గ్స్ మ‌త్తు చాలా రంగాల్లో ఉంది.

డ్ర‌గ్స్ లో సినిమా వోళ్లేనా అంద‌రూ ఉన్నారు. అన్ని రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఉన్నారు. ఇది త‌గ్గాలంటే భార‌త‌దేశంలో క‌ఠిన చ‌ట్టాల‌ను తేవాల్సిన అవ‌స‌రం ఉంది. సింగ‌పూర్ మ‌లేషియా స‌హా అన్నిచోట్లా డ్ర‌గ్స్ ఉంది. కానీ అక్క‌డ క‌ఠిన చ‌ట్టాల‌తో కంట్రోల్ చేస్తున్నారు. కానీ భార‌త‌దేశంలో అది లేదు. ఇక్క‌డ క‌ఠిన చ‌ట్టాలు అమ‌లైతే డ్ర‌గ్స్ తో పాటు రేప్ లు వ‌గైరా కూడా ఆగిపోతాయి. చ‌ట్టాలు క‌ఠినంగా లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇవ‌న్నీ జ‌రుగుతున్నాయ‌ని సుమన్ అన్నారు. రంగుల ప్ర‌పంచం కావ‌డంతో సినిమా వాళ్లే హైలైట్ అవుతున్నారు. డ్ర‌గ్స్ తీసుకోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. క‌ఠిన చ‌ట్టాల‌తోనే ఇది ఆగుతుంది. ఈ రోజు విచార‌ణ చేసి వ‌దిలేస్తే స‌రిపోదు. దాన్ని పూర్తి స్థాయిలో ఎలా రూపుమాపులో తెలుసుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడే డ్ర‌గ్స్ నుంచి అంతా బ‌య‌ట ప‌డ‌తార‌ని సుమ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.