Begin typing your search above and press return to search.

ఫేవ‌రెట్ హీరో కోసం బ్రేక్ డ్యాన్సుల కానుక‌

By:  Tupaki Desk   |   22 Aug 2020 11:00 PM IST
ఫేవ‌రెట్ హీరో కోసం బ్రేక్ డ్యాన్సుల కానుక‌
X
టాలీవుడ్ లో ఎంద‌రో రైజింగ్ హీరోలు ఉన్నారు. చ‌డీ చ‌ప్పుడు లేకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ స‌త్తా చాటుతున్నారు. అలాంటి కుర్రాళ్ల‌ల‌లోనే స‌త్య‌దేవ్ కూడా ఒక‌రు. బిగ్ రేంజు.. నేప‌థ్యం లేక‌పోయినా ప‌ట్టుద‌ల‌తో ఎదుగుతున్న హీరోగా అత‌డిని ఇండ‌స్ట్రీ గుర్తించింది. ఇటీవ‌లే ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య అంటూ ఓటీటీ సినిమాతో ఆక‌ట్టుకున్నాడు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన నటుడిగా నెమ్మదిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు స‌త్య‌. OTT ప్లాట్ ‌ఫామ్ ‌లలో ఈ సంవత్సరం అత‌డు న‌టించిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా రిలీజ‌వుతున్నాయి. అభిమానుల నుంచి చ‌క్క‌ని ప్రశంసలను ద‌క్కుతున్నాయి. 2021 లో నాలుగు సోలో ప్రాజెక్టులతో అత‌డు దుమారం రేప‌నున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. సత్య తన ట్విట్టర్ పేజీలో ఒక డ్యాన్స్ నివాళి వీడియోను విడుదల చేశారు. ఇది చాలామంది సినీ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఇంత‌కీ ఏం ఉంది? అంటే.. మనం ఎవ‌రూ ఇదివ‌ర‌కూ చూడ‌నిది. ఇన్నాళ్లు ఎవరూ అతని సినిమాల్లో అదిరిపోయే డ్యాన్స్ నంబర్లను చూడలేదు. ఈ డ్యాన్స్ వీడియో మంచి నటుడిగానే కాకుండా.. సత్యదేవ్ లో దాగున్న మంచి డాన్సర్ ని కూడా బ‌య‌టి ప్ర‌పంచానికి ఆవిష్క‌రించింది. ముఖ్యంగా మెడ్లీలో స‌త్య బ్రేక్ డ్యాన్సులు ఇర‌గ‌దీశాడు. డ్యాన్సులు వేస్తూ క‌సిగా క‌నిపించాడు. త‌న ఫేవ‌రెట్ ని ఆక‌ట్టుకోవాల‌న్న స‌త్య త‌ప‌న‌ను మెచ్చుకుని తీరాల్సిందే.