Begin typing your search above and press return to search.

మా ఎన్నికల్లోకి పీకే రావాలట?

By:  Tupaki Desk   |   10 Oct 2021 7:30 AM GMT
మా ఎన్నికల్లోకి పీకే రావాలట?
X
మా ఎన్నికల్లో దారుణాతి దారుణ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటి వరకూ తిట్టుకున్న ప్రముఖులు ఈరోజు కొరుక్కునే వరకూ వెళ్లారు.నటుడు శివబాలాజీని నటి హేమ కొరకడం మీడియా కంటికి చిక్కడంతో రచ్చ మొదలైంది. పోలింగ్ కేంద్రంలో రచ్చరచ్చ జరుగుతోంది. పోలింగ్ కేంద్రంలోకి సినీ ప్రముఖులు, వారి మనుషులు వెళుతూ రచ్చ చేస్తున్నారు. గొడవలు, కొట్లాటలు సాగుతున్నాయి.

పోలింగ్ బూతులోనే ఇరువర్గాలు కొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య గొడవ పోలింగ్ బూత్ వద్ద సాగుతోంది. ఈమొత్తానికి మా ఎన్నికలు మునుపు ఎన్నడూ లేనంత రచ్చరచ్చ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే 'మా' ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన నటుడు జీవీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మా ఎన్నికలకు ఒక్కటి తక్కువైందని.. ఇక దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రావడం ఒక్కటే తక్కువ అని అన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేస్తే డబ్బులిచ్చి మరీ ప్రశాంత్ కిషోర్ ను తీసుకువస్తానని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ప్రొడ్యూసర్లు, మేనేజర్స్, డైరెక్టర్ మాకు ఫోన్ చేయడం ఏంటని నటుడు జీవి ప్రశ్నించారు. ఎన్నికల కోసం వాళ్లు ఫోన్ చేయడమేంటి? ఆర్టిస్టుల ఎన్నికల్లో వాళ్ల ప్రమేయం ఏంటని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలోని పెద్దలను కూర్చొని మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఓటర్లను లోబర్చుకునేందుకు దర్శక నిర్మాతలు సైతం రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోందన్నారు.

డబ్బున్న వారు ఫిలింనగర్, జూబ్లిహిల్స్, డబ్బులేని వారు కృష్ణనగర్, మిడిల్ క్లాస్ వారు మణికొండలో ఉంటున్నారని జీవీ తెలిపారు. ప్రేమించేవారికంటే.. పుల్లలు పెట్టేవారే సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారని జీవీ ఆరోపించారు. దీన్ని బట్టి 'మా' ఎన్నికలపై సినీ ప్రముఖులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతోంది.