Begin typing your search above and press return to search.

అసలు డ్రగ్స్ డొంక ఎలా కదిలింది?

By:  Tupaki Desk   |   15 July 2017 1:20 PM IST
అసలు డ్రగ్స్ డొంక ఎలా కదిలింది?
X
హైదరాబాద్ లో టాలీవుడ్ సెలబ్రెటీలే కాదు.. ఇతర రంగాలకు చెందిన బడా బాబులు.. వాళ్ల పిల్లలు డ్రగ్స్ బానిసలని.. నగరంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతుందని ఎప్పట్నుంచో ఆరోపణలున్నాయి. కానీ వాటి గురించి అప్పుడప్పుడూ చిన్న వార్తలు బయటికి రావడమే తప్ప.. ఇప్పట్లా ప్రముఖుల పేర్లు బయటికి రావడం.. నోటీసులు వెళ్లడం.. ఇంత పెద్ద చర్చ జరగడం ఎన్నడూ జరగలేదు. మరి పోలీసులు ఇప్పుడే ఎందుకింత అలెర్టయ్యారు.. వారికి ఇంత పక్కాగా ఎలా సాక్ష్యాధారాలు లభించాయి.. వాళ్లు ఇంత చొరవ తీసుకోవడానికి కారణాలేంటి అన్నది ఆసక్తికరం. ఐతే హైదరాబాద్ లో స్కూలు పిల్లల్ని సైతం డ్రగ్స్ బానిసలుగా చేస్తున్న విషయం వెలుగులోకి రావడంతో అధికారులు సీరియస్ గా దీనిపై దృష్టిపెట్టక తప్పలేదు.

అదే సమయంలో వీరికి సినీ ప్రముఖుల డ్రగ్ రాకెట్ కు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించాయి. రవితేజ తమ్ముడు భరత్ గత నెలలో యాక్సిడెంట్లో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటనా స్థలంలో భరత్ ఫోన్ తో పాటు అతడి వస్తువులు కొన్ని స్వాధీనం చేసుకోగా.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు వాటిని పరిశీలించినపుడు డ్రగ్ రాకెట్ కు సంబంధించిన సమాచారమంతా బయటికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా భరత్ వాట్సాప్ లో దీనికి సంబంధించిన గుట్టు మొత్తం బయట పడిందట. డ్రగ్ రాకెట్ సూత్రధారిగా భావిస్తున్న కెల్విన్ తో అతను తరచుగా సంభాషిస్తున్నట్లు తేలిందట. టాలీవుడ్లో ఎవరెవరు డ్రగ్ రాకెట్లో ఉన్నది కూడా అతడి ఫోన్ ద్వారానే తెలిసిందట. దీనికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూపు కూడా మెయింటైన్ చేస్తున్నట్లు వెల్లడైందట. దాని ఆధారంగానే తీగ లాగితే డొంకంతా కదిలిందని పోలీసులు చెబుతున్నారు.