Begin typing your search above and press return to search.

నటుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ పోత‌న్ ఇక‌లేరు!

By:  Tupaki Desk   |   15 July 2022 5:35 AM GMT
నటుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ పోత‌న్ ఇక‌లేరు!
X
ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ పోత‌న్ (69) మృతి చెందారు. చెన్నైలోని ఆయ‌న నివాసంలో క‌న్నుమూశారు. ఇంట్లో ప‌ని చేసే హౌస్ కీప‌ర్ కాఫీ ఇవ్వ‌డానికి ఆయ‌న గ‌దికి వెళ్ల‌డంతో అప్ప‌టికే ప్ర‌తాప్ పోత‌న్ మృతిచెందార‌ట‌. హార్ట్ ఎటాక్ రావ‌డం వ‌ల్లే ఆయ‌న మృతిచెంది వుంటార‌ని భావిస్తున్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న కూతురు గ‌య కూడా అక్క‌డే వున్నార‌ట‌. ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా త‌మిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో న‌టించారు.

భ‌ర‌త‌న్ 1978లో రూపొందించిన మ‌ల‌యాళ మూవీ 'అర‌వ‌మ్‌' ద్వారా ప్ర‌తాప్ పోత‌న్ న‌టుడిగా కెరీర్ ప్రారంభించారు. త‌మిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో న‌టుడిగా 100కు పైగా చిత్రాలో న‌టించారు. న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వంతో పాటు స్క్రీన్ వ్రైట‌ర్ గా, అభిరుచి గ‌ల నిర్మాత‌గానూ మంచి పేరు తెచ్చుకున్నారు. 1952లో తిరువ‌నంత‌పురంలో జ‌న్మించారు. ఆయ‌న‌ 15 ఏళ్ల వ‌య‌సులోనే తండ్రిని పోగొట్టుకున్నారు. ప్ర‌తాప్ పోత‌న్ అన్న‌య్య హ‌రి పోత‌న్ నిర్మాత‌. ఎన్నె విజ‌య‌వంత‌మైన సినిమాల‌ని నిర్మించారు.

ఊటీలో చ‌దువుకున్న ప్ర‌తాప్ పోత‌న్ మ‌ద్రాస్ క్రిస్టియ‌న్ కాలేజీలో గ్రాడ్య‌యేష‌న్ పూర్తి చేశారు. ఆ త‌రువాతే యాక్టింగ్ పై దృష్టిపెట్టారు. మ‌ల‌యాళ సినిమాతో అరంగేట్రం చేసినా త‌మిళ‌, మ‌ల‌యాళ భాషల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కె. బాల‌చంద‌ర్‌, బాలూ మ‌హేంద్ర‌, భ‌ర‌త‌న్‌, మ‌హేంద్ర‌న్ వంటి ద‌ర్శ‌కుల చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 1985లో వ‌చ్చిన మ‌ల‌యాళ చిత్రం 'మోండుమ్ ఒరు కాద‌ల్ క‌థై' సినిమాతో ప్ర‌తాప్ పోత‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు.

తెలుగులోనాగార్జున‌తో 'చైత‌న్య‌', స‌త్య‌రాజ్ తో జీవా, క‌మ‌ల్ హ‌స‌న్ , ప్ర‌భుతో 'వెట్రివిళ‌', ప్ర‌భుతో 'మైడియ‌ర్ మార్తాండ‌న్‌', నెపోలియ‌న్ తో 'సేవ‌ల‌పేరి పాండీ', కార్తీక్ , సంఘ‌విల‌తో 'ల‌క్కీమెన్‌', శివాజీ గ‌ణేషన్‌, మోహ‌న్ లాల్ ల కాంబినేష‌న్ లో 'ఒరు యాత్ర‌మొళి' వంటి చిత్రాల‌ని రూపొందించి ద‌ర్శ‌కుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.

మ‌ల‌యాళంలో 12 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 1985లో అల‌నాటి హీరోయిన్ రాధిక‌ని వివాహం చేసుకున్న ప్ర‌తాప్ పోత‌న్ ఏడాది తిర‌క్కుండానే విడాకులిచ్చారు. ఆ త‌రువాత అమ‌లా స‌త్య‌నాథ్ ని వివాహం చేసుకున్నారు. అయితే 2012లో ఆమెకు కూడా విడాకులిచ్చారు. వీరికి కూతురు గ‌య వున్నారు.