Begin typing your search above and press return to search.

వీరమల్లు కోసం ఆచార్య స్పెషల్‌...!

By:  Tupaki Desk   |   28 April 2022 6:01 AM GMT
వీరమల్లు కోసం ఆచార్య స్పెషల్‌...!
X
మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు దక్కించుకుంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది.

ఇక ఆచార్య సినిమా పట్ల పవన్ కళ్యాణ్ స్పందన ఏంటీ అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు అన్న చిరంజీవి చిత్రం ఆచార్య గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడక పోవడంను కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక ను పవన్‌ అతిథిగా నిర్వహించాలని భావించారు. కాని ఆయన ఆ సమయంలోనే ఏపీలో పర్యటనలో ఉన్న కారణంగా కుదరలేదు.

ఆచార్య సినిమా ను పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూస్తారు.. ఎప్పుడు ఆయనకు చూపిస్తారు అంటూ దర్శకుడు హరీష్ శంకర్‌ ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి అసలు విషయాన్ని రివీల్‌ చేశాడు. పవన్ కోసం థియేటర్‌ బుక్ చేశాం.. విడుదల అయిన తర్వాత ఒక రోజు పవన్ తో పాటు మా కుటుంబ సభ్యులు చిత్ర యూనిట్‌ సభ్యులందరం కలిసి చూడబోతున్నామని చిరంజీవి చెప్పుకొచ్చాడు.

పవన్‌ కళ్యాణ్ కు అన్న చిరంజీవి అంటే ఎంతటి అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నయ్య పై గౌరవం మరియు అభిమానంతో ఆయనతో కలిసి నటించేందుకు కూడా పవన్ ఓకే అంటాడు. అలాంటి పవన్ ఆచార్య సినిమా ను చూసేందుకు ఆసక్తా ఉండే ఉంటాడు. కనుక చిరంజీవి డేట్‌ ఫిక్స్ చేసి స్క్రీనింగ్‌ కు రమ్మంటే తప్పకుండా వస్తాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే భీమ్లా నాయక్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరో వైపు హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ తో బిజీ బిజీగా ఉన్నాడు. ఒక వైపు సినిమా మరో వైపు రాజకీయం అయినా కూడా ఆచార్య సినిమా కోసం పవన్‌ కళ్యాణ్‌ డేట్ కేటాయించే అవకాశం ఉంది.. అలాగే సమయం కేటాయించే అవకాశం ఉందని మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే హరీష్ శంకర్‌ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్‌ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను తమిళ హిట్‌ మూవీ తేరీ రీమేక్ ను కూడా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి పవన్ ఫుల్‌ బిజీగా ఉన్నాడు.