Begin typing your search above and press return to search.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఆచార్య'

By:  Tupaki Desk   |   22 April 2022 7:30 AM GMT
సెన్సార్ పూర్తి చేసుకున్న ఆచార్య
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. తండ్రీకొడుకులు కలిసి నటించిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

'ఆచార్య' సినిమాకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'యూ/ఏ' (U/A) సర్టిఫికేట్ జారీ చేసినట్లు మేకర్స్ తెలిపారు. అల్టిమేట్ యాక్షన్ చూడటానికి రెడీగా ఉండమని చెబుతూ ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి చేతిలో త్రిశూలం పట్టుకుని ఇంటెన్స్ గా నిలబడి ఉన్నారు. ఇదొక ఫైట్ సీక్వెన్స్ లోని స్టిల్ అని అర్థం అవుతుంది.

టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న కొరటాల శివ.. తనదైన శైలి నేపథ్యానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు 'ఆచార్య' సినిమాలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ధర్మస్థలి అనే ప్రాంతం చుట్టూ జరిగే కథను చెప్పబోతున్నారు. సినిమా రన్ టైం 154 నిమిషాలు (2 గంటల 34 నిమిషాలు) వచ్చినట్లు తెలుస్తోంది.

'ఆచార్య' సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే సందడి చేయనున్నారు. సంగీత - రెజీనా స్పెషల్ సాంగ్స్ లో అలరించబోతున్న ఈ సినిమాలో సోనూసూద్ - జిషు సేన్ గుప్తా - వెన్నెల కిశోర్ - పోసాని కృష్ణ మురళి - తనికెళ్ళ భరణి - సౌరవ్ లోకేష్ కీలక పాత్రలు పోషించారు.

కొణిదెల ప్రొడక్షన్స్ సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిచారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

ఇప్పటికే 'ఆచార్య' సినిమా నుంచి వచ్చిన టీజర్ - ట్రైలర్ - పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా రేపు ఏప్రిల్ 23న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. భారీ అంచనాల నడుమ వచ్చే వారం థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.