Begin typing your search above and press return to search.

'దసరా' షూటింగులో ప్రమాదం .. తృటిలో తప్పించుకున్న నాని!

By:  Tupaki Desk   |   7 Aug 2022 10:32 AM GMT
దసరా షూటింగులో ప్రమాదం .. తృటిలో తప్పించుకున్న నాని!
X
నాని హీరోగా 'దసరా' సినిమా రూపొందుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కథ బొగ్గుగనుల నేపథ్యంలో నడుస్తుంది .. నాని మాస్ లుక్ తో కనిపించనున్నాడు. బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించుకుంటూ వస్తున్నారు. తాజా షెడ్యూల్ షూటింగు కూడా గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలోనే నడుస్తోంది. 'అంటే .. సుందరానికీ' సినిమా రిలీజ్ తరువాత బ్రేక్ తీసుకున్న నాని, 'దసరా' తాజా షెడ్యూల్లో జాయిన్ అయ్యాడు. కొన్ని రోజులుగా అక్కడ చిత్రీకరణ జరుగుతోంది.

'గోదావరి ఖని'లోని బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. బొగ్గు ట్రక్కుతో ముడిపడిన ఒక సన్నివేశాన్ని నానీపై చిత్రీకరిస్తూ ఉండగా, ట్రక్కులోని బొగ్గు పొరపాటున జారిపోయి నానిపై పడబోగా ఆయన తృటిలో తప్పించుకున్నట్టుగా చెబుతున్నారు. స్పాట్ లో ఉన్న వాళ్లు నానీకి పెద్ద ప్రమాదం తప్పిందనే చెబుతున్నారు. ఆ షాక్ నుంచి నాని కోలుకోవడానికి కొంత సమయం పట్టిందట. యూనిట్ సభ్యులంతా కూడా ఆ షాక్ నుంచి పూర్తిగా తేరుకున్న తరువాత షూటింగును మళ్లీ మొదలుపెట్టినట్టుగా సమాచారం.

ఇంతవరకూ నాని చేస్తూ వచ్చిన సినిమాలు ఒక ఎత్తు .. ఇప్పుడు నాని చేస్తున్న ఈ సినిమా ఒక ఎత్తు. ఈ సినిమాలో ఆయన ఊర మాస్ లుక్ తో కనిపిచనున్నాడు. ఇలా పూర్తిస్థాయిలో లుక్ మార్చుకుని నాని చేసిన మొదటి సినిమాగా దీనిని గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలను పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను కొంతవరకూ చిత్రీకరించారు. 'నేను లోకల్' తరువాత నాని సరసన నాయికగా కీర్తి సురేశ్ నటిస్తున్న సినిమా ఇది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బలమైన ఎమోషన్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం నాని బరువు తగ్గడం కూడా జరిగింది. శ్రీకాంత్ ఓదెల ప్రతి పాత్రను డిజైన్ చేసిన తీరు తనకి బాగా నచ్చిందని నాని చెప్పడం, అందరిలో ఈ సినిమా పట్ల ఆసక్తిని పెంచినట్టుగా తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్ .. ప్రకాశ్ రాజ్ .. సముద్రఖని .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 'శ్యామ్ సింగ రాయ్' సెటిమెంట్ తో 'దసరా' సినిమాను క్రిస్మస్ కి విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టుగా చెబుతున్నారు.