Begin typing your search above and press return to search.

'ఆచార్య' నుంచి దుమ్మురేపే అప్ డేట్ రానుందట!

By:  Tupaki Desk   |   23 Nov 2021 9:30 AM GMT
ఆచార్య నుంచి దుమ్మురేపే అప్ డేట్ రానుందట!
X
చిరంజీవి - కాజల్ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందింది. మరో జంటగా చరణ్ - పూజ హెగ్డే సందడి చేయనున్నారు. చూడటానికి చరణ్ ఒక ప్రత్యేకమైన పాత్రను చేసినట్టే కనిపించినా, దర్శకుడిగా కొరటాల ఒక మల్టీ స్టారర్ సినిమా చేసినట్టుగానే అయింది. ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది .. కానీ కరోనా అవాంతరాల వలన వాయిదాలు పడుతూ ఆలస్యమైంది. ఈ కారణంగానే ఈ సినిమా దసరా .. దీపావళి .. సంక్రాంతి పండుగలను దాటుకుని వెళ్లింది. ఫ్రిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఆ మధ్య ఒక ఫస్టు సింగిల్ ను వదిలారు. 'లాహే లాహే ..' అంటూ ఈ పాట సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాట, పార్వతీ పరమేశ్వరుల విరహానికి అద్దంపడుతూ నడుస్తుంది. రామజోగయ్య శాస్త్రి చేసిన పద ప్రయోగాలు పడుచు మనసులను పట్టేసుకుంటాయి. మణిశర్మ బీట్ కూడా భలే జోరుగా హుషారుగా సాగుతుంది. కొరియోగ్రఫీ .. ఫొటోగ్రఫీ .. కాస్ట్యూమ్స్ పరంగా కూడా ఈ పాట మంచి మార్కులు కొట్టేసింది. ఈ పాట జనంలోకి ఒక రేంజ్ లో దూసుకుపోయింది.

ఈ పాటను ఎంతోమంది రీల్స్ చేసి వదిలారు. అంతగా పిల్లల నుంచి పెద్దల వరకూ ఈ పాట అన్నివర్గాల వారిని అలరించింది .. ఆకట్టుకుంది. తాజాగా ఈ పాట నిన్ననే 100 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. ఇలా 'ఆచార్య' నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ అరుదైన రికార్డును అందుకోవడం పట్ల ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ ఉత్సాహంతో ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వదలడానికి రెడీ అవుతున్నారట. చరణ్ పాత్ర వైవు నుంచి ఒక అప్ డేట్ వదలనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు 'ఆచార్య' .. ఇటు సిద్ధ ఈ రెండు పాత్రలు కూడా తెరపై చాలా పవర్ఫుల్ గా కనిపించనున్నాయని అంటున్నారు. అవినీతిని అంతమొందించాలంటే ఆవేశమనేది ఆశయంగా మారాలి .. మాటలతో వినిపించుకోనివారికి ఆయుధాలతోనే గుణపాఠాలు నేర్పాలి అనే కాన్సెప్ట్ తో సాగే కథ ఇది. సోనూసూద్ .. జిషుసేన్ గుప్తా .. పోసాని .. 'ఖడ్గం' సంగీత ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక రెజీనా స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.