Begin typing your search above and press return to search.

డిస్ట్రిబ్యూషన్ లోకి కొత్త హీరో వచ్చాడు

By:  Tupaki Desk   |   16 Nov 2015 7:30 AM GMT
డిస్ట్రిబ్యూషన్ లోకి కొత్త హీరో వచ్చాడు
X
అభిషేక్.. తెలుగు సినిమాల డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఇప్పుడీ పేరు మార్మోగిపోతోంది. వరుసగా పెద్ద సినిమాల్ని ఫ్యాన్సీ ప్రైజ్ కు కొంటూ తన పేరు అందరి నోళ్లలో నానేలా చేస్తున్నాడు అభిషేక్. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ లాంటి పెద్ద సంస్థ భాగస్వామ్యంలో క్రేజ్ ఉన్న సినిమాలపై ఫోకస్ పెడుతూ.. డిస్ట్రిబ్యూటర్ లీగ్ లో తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు.

‘శ్రీమంతుడు’ సినిమాను నైజాం ఏరియాకు ఏకంగా రూ.14.5 కోట్లకు కొని అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచాడు అభిషేక్. నిజానికి ఈ సినిమాను దిల్ రాజు కొనాలనుకున్నారు. కానీ అతడికంటే ఎక్కువ రేటు పెట్టి అభిషేక్ హక్కుల్ని ఎగరేసుకుపోయాడు. అతను చేసింది చాలా పెద్ద రిస్క్ అన్నారు కానీ పెట్టుబడి మీద రూ.5 కోట్ల లాభం అందుకున్నాడు. తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా నైజాం రైట్స్ ను కూడా ఫ్యాన్సీ రేటుకు కొన్నాడు అభిషేక్. ఇక్కడా అతను దిల్ రాజు మీదే గెలిచినట్లు సమాచారం.

మరోవైపు నాని కొత్త సినిమాకు కూడా నిర్మాతలు అనుకున్న దాని కంటే ఎక్కువ రేటు ఇచ్చి పోటీ లేకుండా ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని అభిషేక్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో నాని ఊపు చూసి అతడి మార్కెట్ రేంజికి మించి రేటు పెట్టాడట అభిషేక్. ఇతడి ఊపు చూస్తుంటే దిల్ రాజు మాదిరే త్వరలోనే సినిమాల నిర్మాణంలోకి కూడా వస్తాడేమో.