Begin typing your search above and press return to search.

విలన్ అవతారంలో స్టార్ రైటర్

By:  Tupaki Desk   |   3 Sept 2018 12:54 PM IST
విలన్ అవతారంలో స్టార్ రైటర్
X
అబ్బూరి రవి.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. దశాబ్దంన్నరగా తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేస్తూ సాగిపోతున్నాడు రవి. ‘బొమ్మరిల్లు’ ఒక్కటి చాలు.. రచయితగా రవి టాలెంట్ ఏంటో చెప్పడానికి. టాలీవుడ్ లేటెస్ట్ హిట్ ‘గూఢచారి’కి కూడా అతనే రచయిత. పదుల సంఖ్యలో సినిమాలకు రచన అందించిన అబ్బూరి రవి.. ఇప్పుడు నటుడిగా మారుతుండటం విశేషం. అతను విలన్‌ పాత్రతో అరంగేట్రం చేయబోతున్నాడు. ఆ సినిమా పేరు.. ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ‘వినాయకుడు’ ఫేమ్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో ప్రతినాయక పాత్రలో అబ్బూరి రవి నటిస్తున్నాడట. అబ్బూరి రవి ఈ చిత్రానికి రచనా సహకారం కూడా అందిస్తున్నాడు.

‘వినాయకుడు’ తర్వాత సాయికిరణ్‌ కు సరైన విజయం దక్కలేదు. తొలి సినిమాకు కొనసాగింపుగా చేసిన ‘విలేజ్‌ లో వినాయకుడు’ ఆడలేదు. ఆపై చాలా గ్యాప్ తీసుకుని ‘కేరింత’ తీశాడు. ‘హ్యాపీడేస్’కు జిరాక్స్‌ లా అనిపించిన ఈ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో ఈసారి భిన్నమైన థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు సాయికిరణ్. ఎయిర్ టెల్ ప్రకటనతో సాషా చెత్రి ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం కానుండటం విశేషం. ‘కేరింత’ ఫేమ్ నూకరాజుతో పాటు కార్తీక్ రాజు - నిత్య నరేష్ - మనోజ్ నందం - కృష్ణుడు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయికుమార్ తనయుడు ఆది.. మరో ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. ‘క్షణం’.. ‘గూఢచారి’ ఫేమ్ శ్రీ చరణ్ పాకాల సంగీతాన్నందిస్తున్నాడు. సాయికిరణ్ తమ్ముడైన అడివి శేష్‌ కు అబ్బూరి రవి సన్నిహితుడు. శేష్ కెరీర్‌ ను మలుపు తిప్పిన ‘క్షణం’.. ‘గూఢచారి’ సినిమాల రచనలో రవి కీలకంగా ఉన్నాడు.