Begin typing your search above and press return to search.

‘బుల్లెట్’ను గాలికొదిలేశారే..

By:  Tupaki Desk   |   8 Jun 2017 12:11 PM IST
‘బుల్లెట్’ను గాలికొదిలేశారే..
X
ఏదైనా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందన్నా.. అనుకున్న సమయానికి విడుదల కావట్లేదన్నా ఆ సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ పడిపోతుంది. లేటయ్యే కొద్దీ సినిమా మీద జనాల్లో ఆసక్తి పోతుంది. అలాంటి సినిమాలకు పాజిటివ్ బజ్ తీసుకురావడం అంత సులువు కాదు. ఇలాంటి సినిమాలు అడ్డంకులన్నీ దాటుకుని ఎలాగోలా విడుదలైనప్పటికీ.. ప్రేక్షకాదరణకు నోచుకున్న దాఖలాలు తక్కువే. ఐతే ఇలాంటి సినిమాల చరిత్ర ఎలా ఉన్నప్పటికీ.. చాలా వరకు దర్శక నిర్మాతలు ముందే ఆశలు వదులుకోవడం అన్నది అరుదు. సినిమాను కొంచెం గట్టిగా ప్రమోట్ చేసి.. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాలనే ప్రయత్నిస్తారు. కానీ ‘ఆరడుగుల బుల్లెట్’ టీం మాత్రం అలాంటి ప్రయత్నాలేమీ చేస్తున్నట్లుగా కనిపించట్లేదు.

నాలుగేళ్ల ముందు మొదలై.. మధ్యలో అనేకానేక మార్పులకు గురై.. చివరికి ‘ఆరడుగుల బుల్లెట్’ అనే టైటిల్ తో నెలకిందటే వార్తల్లోకి వచ్చింది ఈ సినిమా. ఐతే టైటిల్ ప్రకటించాక కొన్ని పోస్లర్లు రిలీజ్ చేయడం మినహా సినిమాను పెద్దగా ప్రమోట్ చేసింది లేదు. ఇక వారం కిందట రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇక అంతే.. ఆ తర్వాత సినిమా గురించి పట్టించుకున్న నాథుడు లేడు. నయనతారను ప్రమోషన్ కోసం పిలిస్తే రోజుకు రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఐతే ఆమె సంగతలా వదిలేస్తే.. హీరో గోపీచంద్ కానీ.. డైరెక్టర్ బి.గోపాల్ కానీ.. మీడియాను కలిసింది లేదు. ఇంటర్వ్యూలిచ్చింది లేదు. నిర్మాత మరే రకమైన ప్రమోషన్ కూడా చేయలేదు. ఫైనాన్స్ కు సంబంధించిన గొడవల్లో పడి ప్రొడ్యూసర్ రిలీజ్ ఏర్పాట్లు కూడా పర్యవేక్షించే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో సినిమా ఈ శుక్రవారం విడుదలవుతున్న సంగతే జనాలకు తెలియట్లేదు. లో బజ్ మధ్య సినిమా రిలీజవుతోంది. అసలు ఫైనాన్స్ గొడవల వల్ల శుక్రవారం ఈ చిత్రం అనుకున్న ప్రకారం రిలీజవుతుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/