Begin typing your search above and press return to search.

ఆస్కార్‌ మూవీపై అమీర్‌ మోజు

By:  Tupaki Desk   |   9 March 2019 10:45 AM GMT
ఆస్కార్‌ మూవీపై అమీర్‌ మోజు
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ దాదాపు రెండు దశాబ్ద కాలంగా అత్యధిక సక్సెస్‌ రేటుతో బాలీవుడ్‌ లో దూసుకు పోతున్న టాప్‌ హీరో అనే విషయం తెల్సిందే. ఖాన్స్‌ త్రయంలో కూడా అమీర్‌ ఖాన్‌ టాప్‌ లో నిలిచాడు. ఒక సినిమా వెంట మరో సినిమా చేస్తూనే ఉండే అమీర్‌ ఖాన్‌ గత ఏడాది 'థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌' చిత్రం దారుణమైన పరాజయం పాలవ్వడంతో ఆలోచనలో పడ్డాడు. తదుపరి చిత్రం చేసేందుకు ఆయనకు ధైర్యం చాలడం లేదు. ఇప్పటికిప్పుడు సినిమాకు కమిట్‌ అవ్వడం లేదు.

ఇప్పటి వరకు పలు కథలు విన్న అమీర్‌ ఖాన్‌ కొన్ని కథలను హోల్డ్‌ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే హాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ అయ్యి, ఏకంగా ఆరు ఆస్కార్‌ అవార్డులను దక్కించుకున్న 'ఫారెస్ట్‌ గంప్‌' మూవీపై కూడా అమీర్‌ ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. హాలీవుడ్‌ స్టార్‌ టామ్‌ హాంక్స్‌ నటించిన ఫారెస్ట్‌ గంప్‌ మూవీని హిందీలో రీమేక్‌ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం మొదటి నుండి వ్యక్తం అవుతుంది. తాజాగా అమీర్‌ ఖాన్‌ స్వయంగా రైట్స్‌ తీసుకున్నాడని, రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ చిత్రంతో తన అభిమానులను మరియు ప్రేక్షకులను నిరాశ పర్చిన అమీర్‌ ఈసారి చేసే సినిమాతో మళ్లీ తన అభిమానులను పూర్తి స్థాయిలో తృప్తి పర్చాలని భావిస్తున్నాడు. ఒకవేళ ఫారెస్ట్‌ గంప్‌ సినిమా రీమేక్‌ కనుక అమీర్‌ చేస్తే ఆయన లుక్‌ మొత్తం మార్చుకోవాల్సి ఉంటుంది. ఏ పాత్ర చేస్తే ఆ పాత్ర లుక్‌ కు మారడం అమీర్‌ కు వెన్నతో పెట్టిన విధ్య. అందుకే ఫారెస్ట్‌ గంప్‌ మూవీకి అమీర్‌ ఖాన్‌ బాగా సెట్‌ అవుతాడనే టాక్‌ వినిపిస్తుంది. రీమేక్‌ విషయంలో అమీర్‌ త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమీర్‌ వెయిటింగ్‌ చూస్తుంటే 2019లో ఆయన సినిమా ఉండేలా కనిపించడం లేదు. 2020 వరకు అమీర్‌ ఖాన్‌ సినిమా కోసం వెయిట్‌ చేయాల్సిందే.