Begin typing your search above and press return to search.

400 కోట్లు కొల్లగొట్టేసింది

By:  Tupaki Desk   |   28 Jan 2018 7:22 AM GMT
400 కోట్లు కొల్లగొట్టేసింది
X
అమీర్ ఖాన్ నిర్మించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమాకు రూ.50 కోట్లు కూడా ఖర్చయి ఉండదేమో. ఆ సినిమా ఇప్పుడు చైనాలో పది రోజుల్లోపే 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయడం విశేషం. తొలి రోజే రూ.43 కోట్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచిన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా జోరు తగ్గించలేదు. ‘దంగల్’కు దీటుగా రోజువారీ వసూళ్లలో సంచలనం రేపుతోంది. నిన్న శనివారం ఒక్క రోజు ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చైనాలో 7.56 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టడం విశేషం. శుక్రవారం 5 మిలియన్ల దాకా కలెక్షన్లు వచ్చాయి. శనివారం నాటికి చైనాలో ఈ చిత్ర మొత్తం వసూళ్లు రూ.376 కోట్లు కావడం విశేషం.

ఆదివారం ఈ చిత్రం రూ.400 కోట్ల మార్కును దాటేస్తోంది. తొలి రోజు కంటే కూడా తొమ్మిదో రోజు వసూళ్లు ఎక్కువగా ఉండటం ఈ చిత్రం ఎలాంటి ఆదరణ పొందుతోందో చెప్పడానికి రుజువు. ‘దంగల్’ ఆడిందంటే అది అమీర్ ఖాన్ పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన సినిమా. కానీ ఇందులో అతను చేసింది అతిథి పాత్ర మాత్రమే. ఇది ఒక చిన్న అమ్మాయి కథతో తెరకెక్కిన చిత్రం. తన సంగీతాభిరుచిని తల్లిదండ్రులు అర్థం చేసుకోలేని పరిస్థితితో బురఖా ధరించి.. యూట్యూబ్ ఛానెల్లో పాటలు పాడటం ద్వారా తన కలను నెరవేర్చుకుని గొప్ప పేరు సంపాదించే అమ్మాయి కథ ఇది. ‘దంగల్’ ఊపును కొనసాగిస్తూ మంచి ప్రమోషన్లు చేసి అమీర్ ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేయించాడు. అది అద్భుత ఫలితాన్నిస్తోంంది. అమీర్ కు ఇండియాలో ఎలాంటి క్రెడిబిలిటీ ఉందో.. చైనాలోనూ అతడిపై అలాంటి నమ్మకం కుదిరింది జనాలకు. మున్ముందు అమీర్ అక్కడ చాలా పెద్ద స్టార్ అయిపోయేలా కనిపిస్తున్నాడు.