Begin typing your search above and press return to search.

అసహనం ఉన్నా అమీర్ అంబాసిడరే

By:  Tupaki Desk   |   6 Jan 2016 11:00 PM IST
అసహనం ఉన్నా అమీర్ అంబాసిడరే
X
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కు ఎంత ఇమేజ్ ఉందో.. మత అసహనంపై కామెంట్స్ చేసిన తర్వాత అంత డ్యామేజ్ అయింది. దేశం విడిచి వెళ్లిపోయే పరిస్థితి వస్తుందా అంటూ.. తన భార్య అడుగుతోందంటూ.. పెద్ద నిప్పే రాజేశాడు అమీర్. ఆ తర్వాత దేశ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో.. మొహం దాచుకుని తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఎక్కడికెళ్లినా సెక్యూరిటీ - మీడియాకు దొరక్కుండా తిరగడం.. ఇదీ నెల్లాళ్లుగా అమీర్ అండ్ ఫ్యామిలీ వాలకం. కనీసం న్యూ ఇయర్ సందడి విషయంలో కూడా ఎక్కుడా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో... కొత్త ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇన్ క్రెడిబుల్ ఇండియా ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల నుంచి అమీర్ ఖాన్ ను తప్పించనున్నారనే వార్తలు వచ్చాయి. భారత దేశం గొప్పదనం చాటి చెప్పే ప్రకటనల్లో ఉండే అర్హత అమీర్ కు లేదని, అందుకే తప్పిస్తున్నారనే న్యూస్ హల్ చల్ చేశాయి.

అయితే ఈ రూమర్స్ ను కేంద్ర సమాచార శాఖ ఖండించింది. అమీర్ ఖాన్ ను ఇన్ క్రెడిబుల్ ఇండియా ప్రచారం నుంచి తప్పించే విషయంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పింది. అమీర్ ఖాన్ - టూరిజం శాఖలు ఈ విషయాన్ని వెల్లడించాయని కూడా తెలిపింది. మెక్ కాన్ అనే క్రియేటివ్ ఏజన్సీ ఈ యాడ్స్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. దేశం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యతలను అమీర్ ఖాన్ చేస్తున్నాడు. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు కానీ.. అసలు తప్పించబోవడం లేదని చెప్పకపోవడం ఈ ప్రకటనలో హైలైట్.