Begin typing your search above and press return to search.

'ఆఫత్' వీడియో: రొమాంటిక్ సాంగ్ లో రెచ్చిపోయిన 'లైగర్' జోడీ..!

By:  Tupaki Desk   |   6 Aug 2022 5:07 AM GMT
ఆఫత్ వీడియో: రొమాంటిక్ సాంగ్ లో రెచ్చిపోయిన లైగర్ జోడీ..!
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ''లైగర్''. 'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్ లైన్ తో పూరీ జగన్నాథ్ ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ని తెరకెక్కించారు. ఇందులో వీడీ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

'లైగర్' నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు - టీజర్ మరియు ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. 'అక్డీ పక్డీ' పాటలో విజయ్ మాస్ డ్యాన్స్.. 'వాట్ లగా దేంఘే' సాంగ్ లో విజయ్ యాటిట్యూడ్ ఆడియన్స్ ను ఆకర్షించాయి. ఈ క్రమంలో తాజాగా 'ఆఫత్' అనే మరో వీడియో సాంగ్ ను మేకర్స్ లాంచ్ చేశారు.

నిజానికి శుక్రవారం సాయంత్రమే ఈ సాంగ్ ను విడుదల చేయాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. పూరీ జగన్నాధ్ సముద్రతీరాన బీచ్ లో షూట్ చేసే రొమాంటిక్ సాంగ్స్ సినిమాలో స్పెషల్ గా నిలుస్తుంటాయి. ఇప్పుడు 'ఆఫత్' పాట కూడా అదే కోవకు చెందుతుంది.

'బాబోయ్.. మామూలు డ్రామాలు కావు. అన్నీ లెక్కలేసుకొని, నువ్ బకరా అని ఫిక్స్ అయినాకే నంబర్ ఇస్తాయి.. ఇంక వాట్సాప్ లు షురూ అవుతాయి చూడు.. నిద్ర పోనివ్వవు.. పనులు చేసుకోనివ్వవు.. ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్లే' అంటూ అమ్మాయిల గురించి లైగర్ తల్లి రమ్యకృష్ణ హితబోధ చేస్తుండటంతో 'ఆఫత్' సాంగ్ ప్రారంభమవుతుంది.

'తేనె కళ్ళతోటి పిల్లవాడు పట్టేసిండే.. మందు పెట్టేసిండే.. మంట పుట్టించిండే.. ప్రేమ జెండా తెచ్చి గుండెల్లోన నాటేసిండే.. నాలో దూరేసిండే.. నన్ను మార్చేసిండే..' అంటూ సాగిన ఈ రొమాంటిక్ గీతం అలరిస్తోంది. మోస్ట్ ఎలక్ట్రిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా 'ఆఫత్' నిలుస్తుందని పేర్కొనబడింది.

ఇందులో విజయ్ దేవరకొండ - అనన్య మధ్య కెమిస్ట్రీ ఆకర్షించేలా ఉంది. ఇద్దరూ రొమాంటిక్ సాంగ్ లో రెచ్చిపోయారని చెప్పాలి. అనన్య ఎంతో అందంగా హాట్ గానూ కనిపించింది. ఇద్దరూ బీచ్ ఒడ్డున వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. కెమెరామెన్ విష్ణు శర్మ అందించిన విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.

'ఆఫత్' సాంగ్ కు బాలీవుడ్ కంపోజర్ తనీష్ బాగ్చి ట్యూన్ సమకూర్చారు. గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాయగా.. సింహా & శ్రావణ భార్గవి కలిసి హుషారుగా ఆలపించారు. పీయూష్-షాజియా డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు.

'లైగర్' చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ - అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25న తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల చేయనున్నారు.