Begin typing your search above and press return to search.

భాగమతిలో నేను లేను

By:  Tupaki Desk   |   22 Jan 2018 8:26 AM GMT
భాగమతిలో నేను లేను
X
ఈ శుక్రవారం రానున్న అనుష్క భాగమతిపై ట్రేడ్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాని చెప్పినట్టు 2018లో సాలిడ్ హిట్ అనిపించుకున్న సినిమా ఒక్కటి కూడా రాలేదు కనక అది భాగమతితోనే మొదలవుతుందని జోస్యం చెప్పడం నిజం కావాలని అందరూ కోరుకుంటున్నారు. ట్రైలర్ ద్వారా ఇది కొంచెం రెగ్యులర్ గా అనిపించే అరుంధతి తరహా హారర్ మూవీలా అనిపించినా ఊహకు అందని థ్రిల్స్ ఇందులో చాలా ఉంటాయని దర్శకనిర్మాతలు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో అనుష్క విశ్వరూపంతో పాటు ఆది పినిశెట్టి విలనీ ఓ రేంజ్ లో ఉంటుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కొత్త గెటప్ తో చాలా డిఫరెంట్ గా ఈ పాత్ర ఉంటుందని రకరకాలుగా దీని గురించి చెప్పుకున్నారు.

కాని తాను భాగమతిలో లేనని ఆది పినిశెట్టి స్పష్టం చేస్తున్నాడు. ఈ పుకారు ఎలా మొదలైందో తనకు తెలియదని, అందరూ అనుకున్నట్టు భాగమతిలో తాను విలన్ కానే కానని ఆది పినిశెట్టి తేల్చి చెప్పేసాడు. తనకు యాక్సిడెంట్ అయ్యిందనే వార్త కూడా సోషల్ మీడియాలో వచ్చిందని, అది కూడా అబద్దమని, తాను సంపూర్ణ ఆరోగ్యంతో షూటింగ్స్ లో పాల్గొంటున్నట్టు క్లారిటీ ఇచ్చేసాడు. ఆది చెప్పాడు సరే మరి భాగమతి ఫ్లాష్ బ్యాక్ లో ఆమెను చంపి ఆ స్థితికి వచ్చేలా చేసే అసలు విలన్ ఎవరా అనే అంచనాలు మళ్ళి వేయటం మొదలు పెట్టారు ప్రేక్షకులు.

ఈ సంవత్సరం అజ్ఞాతవాసితో తన జర్నీ మొదలు పెట్టిన ఆది పినిశెట్టి ఊహించని విధంగా అది చేదు ఫలితం ఇవ్వడంతో రామ్ చరణ్ తో చేస్తిన రంగస్థలం మీదే హోప్స్ పెట్టుకున్నాడు. పూర్తి పల్లెటూరి వాతావరణంలో రూపొందుతున్న ఆ సినిమాలో హీరో రామ్ చరణ్ కు అన్నయ్యగా ఆది పాత్ర ఉంటుందని చాల రోజుల నుంచే వార్త ప్రచారంలో ఉంది. హీరోగా త్వరలోనే సినిమా చేయబోతున్నాను అని చెప్పిన ఆది పినిశెట్టి దాని వివరాలు మాత్రం వెల్లడించలేదు.