Begin typing your search above and press return to search.

అనుష్కకు జోడీగా సరైనోడు దొరికాడు

By:  Tupaki Desk   |   5 Jun 2016 7:11 AM GMT
అనుష్కకు జోడీగా సరైనోడు దొరికాడు
X
తెలుగు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిపోదామని.. ఇక్కడే హీరోగా అరంగేట్రం చేశాడు ఆది పినిశెట్టి. కానీ తొలి సినిమా ‘ఒక విచిత్రం’ అతడికి నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని.. ‘గుండెల్లో గోదారి’ చేసినా అదీ సరైన ఫలితాన్నివ్వలేదు. ఐతే ఈ మధ్యే ‘సరైనోడు’లో విలన్ అవతారమెత్తితే రెస్పాన్స్ అదిరిపోయింది. వెంటనే అవకాశాలు వచ్చి పడిపోలేదు కానీ.. అతనైతే మన దర్శక నిర్మాతల బుర్రల్లో రిజిస్టర్ అయిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఆదికి మరో స్పెషల్ రోల్ తగిలినట్లు సమాచారం. సీనియర్ హీరోయిన్ అనుష్కకు అతను జంటగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘భాగమతి’లో ఆది ఆమెకు జోడీగా నటించబోతున్నాడట. ఇప్పటికే దర్శకుడు జి.అశోక్ ఆదికి తన పాత్ర గురించి చెప్పగా.. అతను ఆసక్తి చూపించాడట. త్వరలోనే కన్ఫర్మేషన్ రావచ్చు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నటీనటుల విషయంలో అశోక్ స్మార్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే మలయాళ నటుడు జయరాంను విలన్ పాత్రకు ఎంచుకున్నాడు. మరోవైపు టబుతో ఓ కీలకమైన పాత్ర చేయించడానికీ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆది లైన్లోకి వచ్చాడు. ఈ కాంబినేషన్ కుదిరితే.. ‘భాగమతి’ తెలుగు-తమిళం-మలయాళం-హిందీ.. ఇలా నాలుగు భాషల్లోనూ వర్కవుటైపోతుంది. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. అప్పటికల్లా ‘భాగమతి’ కాస్టింగ్ గురించి ఓ క్లారిటీ వచ్చేస్తుంది.