Begin typing your search above and press return to search.

తండ్రికి కటింగ్ చేసి డబ్బులు తీసుకున్న హీరో

By:  Tupaki Desk   |   16 Jun 2020 4:00 PM GMT
తండ్రికి కటింగ్ చేసి డబ్బులు తీసుకున్న హీరో
X
లాక్ డౌన్ వేళ అందరికీ జుట్టు పెరిగిపోయింది. గడ్డం వచ్చేసింది. రోజూ సొంతంగా షేవింగ్ చేసుకునేవాళ్లు మేనేజ్ చేసుకోగలిగారు కానీ.. సెలూన్లకు వెళ్లి షేవింగ్ చేసుకునేవాళ్లకు కష్టమైపోయింది. షేవింగ్ అయినా ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు కానీ.. కటింగ్ అంటే చాలా కష్టమే. షేప్ మెయింటైన్ చేస్తూ క్రాఫ్ సొంతంగా చేసుకోవడం కష్టం. ఈ నేపథ్యంలో కొందరు ట్రిమ్మర్ పెట్టి ఏదో ట్రై చేశారు. కొందరు గుండు చేయించుకున్నారు. ఇంట్లో పిల్లలు పెద్దలకు సొంతంగా కటింగ్ చేసే ప్రయత్నం చేశారు. సెలూన్లు తెరుచుకున్నాక కూడా కరోనా భయంతో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే హేర్ కట్, షేవింగ్ సొంతంగా చేసుకుంటూ తమ కుటుంబీకులకు చేస్తున్న వాళ్లు చాలామందే ఉన్నారు. అందులో హీరో ఆది పినిశెట్టి కూడా చేరాడు.

అతను తన తండ్రి, లెజెండరీ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టికి కటింగ్‌తో పాటు షేవింగ్ కూడా చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను కూడా అతను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఒకప్పటితో పోలిస్తే బాగా సన్నబడి గుర్తుపట్టని విధంగా తయారైన రవిరాజా.. తన కొడుకుతో కటింగ్, షేవింగ్ చేయించుకున్నాక అతడికి డబ్బులు కూడా ఇచ్చాడు. ముందు ఇదేంటి అంటూ నవ్వేసిన ఆది.. తర్వాత ఆ డబ్బు తీసి పర్సులో పెట్టుకున్నాడు. రవిరాజాకు ఇద్దరు కొడుకులు. సత్యప్రభాస్ అనే ఒక కొడుకు దర్శకుడిగా మారాడు. తమిళంలో రెండు సినిమాలు తీశాడు. ఇక ఆది ‘ఒక విచిత్రం’ సినిమాతో తెలుగులోనే హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక తమిళంలోకి వెళ్లిపోయాడు. అక్కడ మంచి మంచి సినిమాలు చేసి హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.